iDreamPost

ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్ భారీ షాక్..

ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్ భారీ షాక్..

ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు గా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం. కరోనా వైరస్ విషయంలో చైనాను మొదటినుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)వెనకేసుకొస్తుందని ఆది నుండి తీవ్ర ఆరోపణలు చేస్తున్న ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద షాక్ ఇచ్చారు. డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా అందించే నిధులు ఆపివేస్తున్నట్లు ప్రకటించి అన్నంత పని చేశారు.

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి గల కారణాలను ఇతరులపై పైకి నెట్టేందుకు ట్రంప్ మొదటినుండి ప్రయత్నిస్తున్నారు. ఆది నుంచి కరోనా వైరస్ ను తేలికగా తీసుకున్న ట్రంప్.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. అది ఒక చిన్న వైరస్, అది మనల్ని ఏం చేస్తుంది.. అంటూ డబ్ల్యు.హెచ్.ఓ, నిపుణులు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. చివరకు కరోనా పై అప్రమత్తం చేసిన తన ఆరోగ్య సలహాదారు ను కూడా పదవి నుంచి తప్పించారు. అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆ నెపాన్ని చైనా పైకి నెట్టివేశారు. వైరస్ గురించి చైనా ప్రపంచ దేశాలకు సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో తాజాగా ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వల్లే అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో అనారోగ్య ముప్పు తలెత్తినప్పుడు ప్రపంచ దేశాలూ సరైన సమాచారం కోసం డబ్ల్యూహెచ్‌ఓపై ఆధారపడతాయని గుర్తుచేశారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతాయుతంగా నడుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదినుండి చైనా విషయంలో పక్షపాతిగా వ్యవహరిస్తుందని దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

అమెరికా తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొన్న అత్యంత వినాశకరమైన నిర్ణయమని స్పష్టం చేశారు. డిసెంబర్ లోనే కరోనా వైరస్ ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తుంది అనడంలో ఆధారాలు ఉన్నప్పటికీ అంటువ్యాధి కాదన్న చైనా వాదనకి మద్దతుగా నిలిచి ప్రపంచాన్ని హెచ్చరించడంలో జాప్యం చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థను దుయ్యబట్టారు.. దానికి తోడు ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించడంలో కూడా జాప్యం చేసిందని ట్రంప్ స్పష్టం చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉదాసీన వైఖరివల్లనే ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాపించింది ట్రంప్ ఆరోపించారు.

అమెరికా ద్వారా డబ్ల్యూహెచ్ఓకు ఏటా 400 నుంచి 500 మిలియన్ల డాలర్లు అందుతుంటే చైనా కేవలం 40 మిలియన్ డాలర్లు కేటాయిస్తోందని ట్రంప్ తెలిపారు. చైనాతో ఉన్న సరిహద్దులను మూసేయద్దంటూ డబ్ల్యూహెచ్ఓ చేసిన సూచన అత్యంత ప్రమాదకరమైనది. సరిహద్దులు మూసేయాలనే అమెరికా నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగాం’ అన్ని ట్రంప్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే వైరస్ వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా జరిగిందని ట్రంప్ తెలిపారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా 19,79,477 మంది కరోనా వైరస్ సోకింది. వీరిలో 1,26,539 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు 6,12,576 మందికి కరోనా వైరస్‌ సోకగా వీరిలో 29,798 మంది మృతిచెందారు. నిన్న ఒక్కరోజే 2129 మంది మరణించడం అక్కడి కరోనా వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి