iDreamPost

ట్రంప్ కీలక నిర్ణయం – అమెరికాలో వలసలపై నిషేధం

ట్రంప్ కీలక నిర్ణయం – అమెరికాలో వలసలపై నిషేధం

కరోనా వైరస్ కారణంగా అగ్రరాజ్యం అతలాకుతలం అయింది. ఆర్థిక సంక్షోభంలో అగ్రరాజ్యం కూరుకుపోయింది. కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. దానికి తోడు చమురు ధరలు పాతాళానికి పడిపోవడంతో అమెరికా చమురు ఉత్పత్తి కంపెనీలు దివాళా బాట పట్టాయి. నిరుద్యోగం పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.అమెరికా వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.

అమెరికాలో ఇప్పటికే దాదాపు 2.2 కోట్లమంది నిరుద్యోగభృతికి దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో ట్రంప్ అమెరికాలో నిరుద్యోగ తీవ్రతను తగ్గించేందుకు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. అమెరికలోకి వచ్చే వలసలను తాత్కాలికంగా నిషేధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

“ఓ అదృశ్య శక్తి దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్లే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై నేను సంతకం చేయబోతున్నాను” అని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అమెరికాకు వెళ్ళేవారిలో భారత్,చైనా వాసులే అధికంగా ఉన్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే అమెరికాకు విదేశీయులు వలస వెళ్లేందుకు అవకాశం ఉండదు. మళ్ళీ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు విదేశీ వలసలపై నిషేధం కొనసాగుతుంది. అమెరికా ప్రజల ఉద్యోగ భద్రతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

ఇప్పటికే అమెరికాలో సుమారు 7,98,742 మంది కరోనా వైరస్ బారిన పడగా, 42,604 మంది మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి