iDreamPost

సిటింగ్ లే అభ్యర్థులుగా టీఆర్ఎస్ తొలి జాబితా : మలి జాబితా స్థానాలపై తీవ్ర చర్చ

సిటింగ్ లే అభ్యర్థులుగా టీఆర్ఎస్ తొలి జాబితా : మలి జాబితా స్థానాలపై తీవ్ర చర్చ

గ్రేటర్ వార్ కు అన్ని పార్టీలూ సర్వ సన్నాహామవుతున్నాయి. అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. సైన్యాన్ని ప్రకటిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ 29 మందికి చోటు కల్పించింది.

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మందితో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కలిసొచ్చేలా 105 మందితో తొలి జాబితా సంఖ్యను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది సిట్టింగ్‌లకు తిరిగి టికెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

ఆ స్థానాలపై ఆచి తూచి వ్యవహరించండి..

గ్రేటర్‌లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న టీఆర్ఎస్… పనితీరు సరిగ్గా లేని వారికి ఈసారి మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దని గట్టి నిర్ణయానికి వచ్చింది. అందుకే పనితీరు సరిగ్గా లేని అభ్యర్థులకు సంబంధించిన టికెట్లకు మొదటి జాబితాలో పెండింగ్‌లో పెట్టినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. తొలి జాబితా విడుదలకు ముందు సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించారు. ప్రతిపక్షాలను విమర్శలను ఎలా తిప్పికొట్టాలో దిశానిర్దేశం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, 110 సీట్లకు పైగా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కొన్ని స్థానాలకు సంభందించి అభ్యర్థుల విషయంలో చాలా కోణాలను పరిశీలించాలని చెప్పినట్లు తెలిసింది. ప్రధానంగా బీజేపీ బలం ఉన్న చోట్ల ఆ అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని దీటైన వ్యక్తిని టీఆర్ఎస్ నుంచి నిలబెట్టాలని కేసిఆర్ సూచించారు. దీంతో అధిష్టానం కొన్ని స్థానాలలో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తొలి జాబితాలో ప్రకటించిన 105 మందిలో అందరూ సిట్టింగ్ లే కాగా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చినట్లు కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి