iDreamPost

ఆసక్తికరంగా మారుతున్న ఏపీ హైకోర్టు వాదనలు

ఆసక్తికరంగా మారుతున్న ఏపీ హైకోర్టు వాదనలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వ్యవహారాలు ఇప్పటికే చర్చనీయాంశం అయ్యింది. సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లాయి. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి మీద, కొందరు హైకోర్ట్ న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేసేటంత వరకూ వెళ్లిందంటేనే సీన్ అర్థమవుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం కోర్ట్ వ్యవహారాల మీద కామెంట్స్ హోరెత్తుతున్నాయి. తమను కించపరిచారంటూ న్యాయమూర్తులు కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో కేసు సీబీఐ వరకూ వెళ్లింది. దేశంలోనే తొలిసారిగా సోషల్ మీడియా పోస్ట్ గురించి సీబీఐ దర్యాప్తు చేసే వరకూ వెళ్లడమే ఏపీ హైకోర్ట్ ప్రత్యేకతకు దర్పణం పడుతోంది.

కొంతకాలంగా ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నప్పటికీ హైకోర్ట్ వ్యవహారాల్లో మాత్రం పెద్దగా మార్పులు రాలేదు. అందుకు తాజాగా హెబియస్ కార్పస్ పిటీషన్ పై జరిగిన విచారణ ఉదాహరణగా చెప్పవచ్చు. విచారిస్తున్న అంశం వేరు.. సందర్భం వేరు. అయినప్పటికీ అందులో అమరావతి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా జస్టిస్ రాకేష్ కుమార్ తీరు ఆసక్తిగా మారుతోంది. పైగా మతిలేని చర్యగా ప్రభుత్వ నిర్ణయాన్ని అభివర్ణించడం విస్మయకరంగా మారుతోంది. వాస్తవానికి ఏపీ రాజదాని అంశంలో అమరావతి ఎంపిక నుంచి, ప్రస్తుతం పాలనా వికేంద్రీకరణ వరకూ అన్నీ అసెంబ్లీలో రూపొందించిన చట్ట ప్రకారం సాగుతున్న చర్యలు. ఇటీవల గవర్నర్ ఆమోద ముద్ర వేయడం , కేంద్రం కూడా పాలనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేయడం అందరికీ ఎరుకే.

అయినప్పటికీ హైకోర్ట్ న్యాయమూర్తి మతిలేని చర్యగా అభివర్ణించడం పట్ల అనేక మంది న్యాయనిపుణులు సైతం నోరెళ్లబెట్టే పరిస్థితి వచ్చింది. గతంలో ఓ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది చేసిన తప్పునకు బాధ్యతగా డీజీపీని రాజీనామా చేసి వెళ్లాలనే సలహాలు కూడా ఏపీ హైకోర్ట్ బెంచ్ నుంచి వెలువడ్డాయి. తాజాగా ప్రభుత్వం చేసిన చట్టంపై మరో బెంచ్ విచారణలో ఉండగా, సంబంధం లేని అంశంలో విచారణ చేస్తున్న సందర్భంలో రాజధానుల అంశం ప్రస్తావించడం చర్చనీయాంశం అయ్యింది. అదే సందర్భంగా సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ ప్రస్తావించిన అంశాలు దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. న్యాయస్థానాలు తమ పరిధిని మరచిపోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్య చాలా తీవ్రమైనదిగా పరిగణించాలి. అలాంటి పరిస్థితికి దారితీసిన పరిస్థితులను కూడా గుర్తించాలి.

ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటే, బయట రాష్ట్రాల నుంచి వచ్చి, ఇక్కడి ఇబ్బందులు తెలియని జడ్జి రాజధాని గురించి వ్యాఖ్యానించడం సరికాదని స్టాండింగ్ కౌన్సిల్ పేర్కొనాల్సి రావడం వాస్తవ స్థితికి దర్పణం పడుతోంది. మంచి నీళ్లు కూడా దొరకవు..ఏదయినా జరిగితే వైద్య సహాయం ఉండదు.. ఎడారి లాంటి ప్రాంతంలో హైకోర్ట్ ఎందుకు నిర్మించారో తెలియదు. అలాంటి అంశాలలో త్రిసభ్య బెంచ్ ముందు ఉన్న అంశం చర్చకు తీసుకురావడం సరికాదని సీనియర్ కౌన్సిల్ నేరుగా జడ్జి ముందు ప్రస్తావించడం గమనిస్తే ఏపీ హైకోర్టులో వాదనలు అర్థమవుతాయి. ఇప్పటికే ఏపీలో శాసన, న్యాయ వ్యవస్థ మధ్య ఏర్పడుతున్న అగాధం మరింత పెంచేందుకు ఇలాంటివి అవకాశం ఇస్తాయి.

జాతీయ స్థాయిలో ఏపీ హైకోర్ట్ తీరు పెద్ద దుమారం రేపిన తరుణంలో విషయం మరింత ముదరకముందే తగిన రీతిలో స్పందించడం న్యాయవ్యవస్థకు మేలు చేస్తుంది. వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడేయత్నంలో అందరూ బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకు భిన్నంగా ఏ స్థాయిలో ఉన్న వారు వ్యవహరించినా అది మొత్తం వ్యవస్థకే చేటు తెస్తుందనే అంశం పదే పదే నిరూపితం అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి