iDreamPost

కొత్త దర్శకులకు ట్వీట్ల నష్టం

కొత్త దర్శకులకు ట్వీట్ల నష్టం

సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఆ క్షణం అనిపించింది ట్వీట్లుగా పెట్టేయడం ఎప్పుడో భవిష్యత్తులో దాని తాలూకు సెగలను చూపిస్తోంది. ముఖ్యంగా ఏళ్ళ తరబడి ఎదురుచూసి దర్శకులుగా అవకాశం అందుకున్న వాళ్లకు శరాఘాతంగా మారుతోంది. నిన్న విడుదలైన రామారావు ఆన్ డ్యూటీకి పబ్లిక్ నుంచే నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ షో పడక ముందే గతంలో అతను ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యల వల్ల సదరు నాయకుడి అభిమానులు పర్సనల్ గా తీసుకుని సినిమాకు అప్పటికే జరిగిన డ్యామేజ్ ని మరింత పెంచేందుకు పూనుకున్నారు.

ఇటీవలే మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే తరహాలో పాత ట్వీట్ల పంచాయితీలో ఇరుక్కుని ఆఖరికి సైబర్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. తన మెసేజులను ఫోటో షాప్ లో ఎడిట్ చేసి చెడ్డ పేరు తెస్తున్నారని ఫిర్యాదు చేశారు. శరత్ మండవ విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చు. పొలిటికల్ అజెండాలతో పరిశ్రమలో ఉన్నవాళ్ళు పబ్లిక్ తో కమ్యూనికేట్ అయితే వచ్చే సమస్యలు ఇలాగే ఉంటాయి. అసలే థియేటర్ల దగ్గర జనం లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. పబ్లిక్ ని ఎలా రప్పించాలో అర్థం కాక ఇండస్ట్రీ పెద్దలు గత వారం రోజులుగా రకరకాల చర్చల్లో తలమునకలయ్యారు. రేపో ఎల్లుండో నిర్ణయాలు వస్తాయి.

ఇలాంటి సున్నితమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాజకీయం కావొచ్చు సినిమా కావొచ్చు ఫ్యాన్స్ మరీ సున్నితంగా ఉంటున్నారు. ఇష్యూ చిన్నదైనా పెద్దదైనా దానికి స్పందించే విధానం తీవ్రంగా ఉంది. అవసరం లేని కులసామాజిక సమీకరణాలు బయటికి వస్తున్నాయి. దీని వల్ల సదరు సినిమాల మీద వ్యతిరేకత వచ్చి టాకులు రివ్యూలు రావడానికి ముందే బ్యాడ్ అయిపోతున్నాయి. ట్వీట్ల లాంటి వాటికి డిలీట్ చేసే ఆప్షన్లు ఉన్నా స్క్రీన్ షాట్ల రూపంలో నెటిజెన్లు ఎప్పటికప్పుడు భద్రపరుచుకునే తెలివితేటలు చూపిస్తున్నారు. ఈ స్థాయిలో రచ్చ జరగడానికి ఇవే కారణం అయ్యాయి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి