iDreamPost

Online Games: ఆన్ లైన్ గేమ్ కు బానిస.. తల్లీ కొడుకులు బలి!

Online Games: ఆన్ లైన్ గేమ్ కు బానిస.. తల్లీ కొడుకులు బలి!

ఆన్ లైన్ గేమ్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా భారత్ లో కూడా ఆన్ లైన్ గేమ్స్ అంటే పడి చచ్చిపోయేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ ఆన్ లైన్ గేమ్స్ వల్ల ఎంతో మంది జీవితాలను కూడా నాశనం చేసుకున్నారు. పబ్ జీ లాంటి గేమ్స్ కు బానిసలై ప్రాణాలు తీసుకున్న వారు.. ప్రాణాలు తీసిన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన ఒక గృహిణి తన ప్రాణాలు తీసుకోవడం మాత్రమే కాకుండా కడుపున పుట్టిన ఇద్దరు కొడుకుల ప్రాణాలు కూడా తీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో జరిగింది. అవిశెట్టి మల్లేశ్, రాజేశ్వరి(28) దంపతులకు అనిరుధ్(5), హర్షవర్ధన్(3) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లేశ్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజేశ్వరి ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. అయితే రాజేశ్వరికి ఆన్ లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉంది. ఆడి ఆడి ఆన్ లైన్ గేమ్స్ కు రాజేశ్వరి బానిసగా మారిపోయింది.

ఆన్ లైన్ గేమ్స్ కోసం అప్పులు చేయడం కూడా మొదలు పెట్టింది. ఏడాదికాలంగా బంధువుల వద్ద అప్పులు చేసింది. మొత్తం రూ.8 లక్షల వరకు చేసింది. అయితే మంగళవారం బంధువుల్లో ఒకరు ఇంటికి వచ్చి అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించాలి అంటూ గొడవ పెట్టుకున్నాడు. స్థలం అమ్మి అప్పు తీరుస్తామని చెప్పినా వినలేదు. తర్వాత కాసేపటికి అతను వెళ్లిపోయాడు. మల్లేశ్ కూడా ఏదో పని మీద బయటకు వెళ్లాడు. ఈ గొడవతో తన పరువు మొత్తం పోయిందని రాజేశ్వరి భావించింది.

అవమాన భారాన్ని భరించలేక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఇంటి ఆవరణలో ఉన్న సంపులో ఇద్దరు పిల్లలను పడేసి.. తాను కూడా దూకేసి ఆత్మహత్యకు పాల్పడింది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన మల్లేశ్ పిల్లలు, భార్య కోసం వెతికాడు. సంపు తెరిచి ఉండటం చూసి.. వెళ్లి చూడగా ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో మల్లేశ్ ఒక్కసారిగా కుటుంబాన్ని కోల్పోయినట్లు అయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి