iDreamPost

తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు..?

తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు..?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థి ఎవరన్న అంశంపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ కరోనా వైరస్‌తో అకాల మరణం పొందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇస్తుందన్న ఊహాగానాల మధ్య ఇటీవల టీడీపీ తన అభ్యర్ధిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మీ పేరును ప్రకటించింది.

వైసీపీ అభ్యర్ధిగా ఎవరుంటారనే అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో నిన్న గురువారం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమై చర్చించారు. ఈ రోజు బల్లి దుర్గా ప్రసాద్‌ తనయుడు కళ్యాణ్‌ చక్రవర్తి, సతీమణిలు మంత్రులు పెద్ది రామచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణలతో కలసి సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీపై సీఎం వైఎస్‌ జగన్‌ వారితో మాట్లాడినట్లు సమాచారం.

సీఎంతో భేటీ తర్వాత కళ్యాణ్‌ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయలేమని తాము సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపినట్లు కళ్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. తమకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం జగన్‌ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఉప ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా.. గెలుపుకోసం పని చేస్తామని సీఎంకు హామీ ఇచ్చినట్లు కళ్యాణ్‌ పేర్కొన్నారు. బల్లి దుర్గా ప్రసాద్‌ రావు కుటుంబానికి రాజకీయంగా అండగా ఉంటామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ గురుమూర్తి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఆది నుంచి ఉన్న గురుమూర్తి.. వైఎస్‌ షర్మిళ చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలోనూ.. వైఎస్‌ జగన్‌ చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రలోనూ వారిద్దరికి ఫిజియోథెరపిస్ట్‌గా సేవలందించారు. పాదయాత్రలో షర్మిళ, వైఎస్‌ జగన్‌లు అనారోగ్యానికి గురైన సమయంలో గురుమూర్తి వైద్యసేవలు అందించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి