iDreamPost

టార్గెట్ 3 లక్షలు

టార్గెట్ 3 లక్షలు

కొన్ని నెలలుగా ప్రధాన రాజకీయ పార్టీలు ఆతృతగా నిరీక్షిస్తున్న తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూలు విడుదలైంది. తిరుపతి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూలు ప్రకటించింది. ఈ నెల 23న నోటిఫికేషన్‌ వెలువడనుంది. అదే రోజు నుంచీ నామినేషన్లు దాఖలు చేయడానికి వీలుంటుంది. 30వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి గడువు. ఏప్రిల్‌ 17వ తేదీన పోలింగ్‌.. మే 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది.

తిరుపతి లోక్ సభ పరిధిలోకి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. చిత్తూరు నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లు.. నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లు వుంటాయి. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం తో పాటు దీని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.

రెండేళ్లలో భారీగా పుంజుకున్న వైసీపీ

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ముంగిట మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ప్రధాన ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీశాయి. ముందు నుంచే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తిరుపతి ఉప ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. అయితే మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఈ పార్టీల ఉత్సాహాన్ని దెబ్బతీశాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికలతో పోలిస్తే తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల స్థితిగతులు తిరుపతి నగరంలో గణనీయంగా తారుమారయ్యాయి. అధికార పార్టీకి 18 శాతానికి మించి ఓట్ల బలం పెరగ్గా, టీడీపీకి ఓట్ల బలం 19 శాతానికి పైగా తగ్గిపోయింది. జనసేన పార్టీ కూడా 6 శాతానికి మించి ఓట్లు కోల్పోయింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒక శాతానికి పైగా ఓట్ల బలాన్ని పోగొట్టుకుంది.

రెండేళ్లలో తారుమారు

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఒక పంచాయతీ మినహా నగర కార్పొరేషన్‌ కిందకి వస్తుంది. 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డికి 80544 (44.64 శాతం) ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థి సుగుణమ్మకు 79836 (44.25 శాతం) ఓట్లు పడ్డాయి. 708 ఓట్ల ఆధిక్యంతో కరుణాకర్‌రెడ్డి గెలిచారు. వీరిరువురి నడుమ ఓట్ల తేడా 0.4 శాతం మాత్రమే.

అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల తక్కువ రెండేళ్ళవుతోంది. ఈ రెండేళ్ళలో వైసీపీ భారీగా బలం పుంజుకుంది. తాజాగా జరిగిన తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ 47,708 (62.90 శాతం) ఓట్లు సాధించగా టీడీపీ 18,712 (24.67 శాతం) ఓట్లు తెచ్చుకుంది. వీటి రెండింటి నడుమ తేడా 38.23 శాతం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓట్లు 18.26 శాతం పెరిగాయి. టీడీపీ 19.58 శాతం ఓట్లు కోల్పోయింది.

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపీ 2,385 ఓట్లు సాధించింది. పోలైన ఓట్లలో 1.32 శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి 2,546 ఓట్లు రాగా పోలైన ఓట్లలో 3.35 శాతం ఓట్లు సాధించినట్టయింది. జనసేన గత అసెంబ్లీ ఎన్నికల్లో 12,315 ఓట్లు సాధించగా పోలైన ఓట్లలో 6.83 శాతం ఓట్లు వచ్చినట్టయింది. అదే ఇప్పటి మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 231 ఓట్లు మాత్రమే పడ్డాయి. పోలైన ఓట్లలో ఇది 0.03 శాతం మాత్రమే.

గత ఎన్నికల నాటితో పోలిస్తే పోలైన ఓట్లలో జనసేన ఓట్ల బలం 6.53 శాతం తగ్గినట్టయింది. కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 2,725 ఓట్లు తెచ్చుకుంది. పోలైన ఓట్లలో ఆ పార్టీ 1.53 శాతం ఓట్లు పొందింది. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో కేవలం 96 ఓట్లతో పోలైన ఓట్లలో 0.13 శాతం దక్కించుకుంది.

పంచాయతీలు, మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్

తిరుపతి లోక్ సభ పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 125 వార్డులో టీడీపీ కేవలం మూడు వార్డులు మాత్రమే గెలిచింది.
వెంకట గిరిలో ఒక్క వార్డ్ కూడా గెలవలేదు. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలలో తిరుపతిలో ఒక్కో వార్డ్ మాత్రమే గెలిచింది.

గత ఎన్నికల్లో ఇలా…

2019లో జరిగిన ఎంపీ ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసిన బల్లి దుర్గా ప్రసాద్ కి 7,22,877(55%), టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ కి 4,94,501(37%), బీజేపీ నుంచి పోటీ చేసిన బొమ్మి శ్రీహరి కి 16,125(1%) ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తానికి వైసీపీ అభ్యర్థి 2.30 లక్షల మెజారిటీ తో గెలుపొందారు.

3 లక్షల టార్గెట్

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల గెలుపుతో ఊపు మీదున్న అధికార పార్టీ గత మెజారిటీ కంటే ఎక్కువ సాధిస్తామని చెప్తోంది. పెరిగిన ఓటు బ్యాంకు దృష్ట్యా 3 లక్షల మెజారిటీని సునాయాసంగా సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి