iDreamPost

వైసీపీ అధ్యక్షుడు ఎవరో తెలియకపోతే ఎలా లక్ష్మణ్‌ గారు..?

వైసీపీ అధ్యక్షుడు ఎవరో తెలియకపోతే ఎలా లక్ష్మణ్‌ గారు..?

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికీ గెలవాలనే ఆశ ఉంటుంది. ఇక ప్రధాన పార్టీలైతే గెలుపు కోసం ఎంతో కృషి చేస్తాయి. అభ్యర్థుల ప్రచారమే కాదు.. ఆయా పార్టీల ముఖ్య నేతలు, ప్రజలకు సుపరిచితులైన నేతలు ప్రచార పర్వంలోకి దిగుతారు. అయితే వారు చేసే ప్రచారం పార్టీకి మేలు జరిగేలా ఉండాలి కానీ.. నష్టం చేకూర్చేలా,. నవ్వులపాలయ్యేలా ఉండకూడదు.

తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. ఉదృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. తెలంగాణతో సహా జాతీయ స్థాయి నేతలతో ప్రచారం చేయిస్తోంది. ఏపీ నేతలతో పాటు తెలంగాణకు చెందిన రఘునందన్‌రావు ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ దగ్గర పడుతుండడంతో ముఖ్యనేతలు ఒక్కొక్కరూ ప్రచారానికి వస్తున్నారు. ఈ రోజు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, తెలంగాణకు చెందిన కె.లక్ష్మణ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

లక్ష్మణ్‌ ప్రచారం బీజేపీ లాభం చేకూర్చకపోగా.. నష్టం చేసేలా ఉంది. ఏపీ రాజకీయాలపై కనీస అవగాహనలేని లక్ష్మణ్‌ చేసిన విమర్శలు బీజేపీని నవ్వులపాలు చేసింది. తన ప్రభుత్వ 21 నెలల పాలనలో ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూ, వైసీపీ అభ్యర్థికి ఓటేయాలని పార్లమెంట్‌ పరిధిలోని కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ రాసిన లేఖపై లక్ష్మణ్‌ విమర్శలు చేశారు. వైసీపీ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ రాయాల్సిన లేఖను సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ ఎలా రాస్తారంటూ ప్రశ్నించారు.

Also Read : పరిపూర్ణానంద… స్వామీజీ నా..? రాజకీయవేత్త నా..?

ఈ ప్రశ్నతోనే లక్ష్మణ్‌కు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని తేలిపోయింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కాగా.. గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ. కనీసం ఈ విషయం కూడా తెలియకుండా లక్ష్మణ్‌ ఏపీలో ఎన్నికల ప్రచారం చేసేందుకు వచ్చారా..? అనే సందేహాలు కమలం పార్టీ కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

తన పాలనపై నమ్మకం ఉంటే.. లేఖలు రాయాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే ఉన్నా ప్రజలు గెలిపిస్తారని లక్ష్మణ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రచారానికి వస్తున్నారంటే.. బీజేపీకి భయపడ్డారంటూ చెప్పుకొచ్చారు. లక్ష్మణ్‌ చెప్పిందే నిజమని అనుకుంటే.. సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీనే కాలికి బలపం కట్టుకుని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. మరి దేశ ప్రధానికి దేశ ప్రజలకు మంచి చేశారని నమ్మితే.. ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు బీజేపీ ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్నాయి. నమ్మకం లేకనే మోదీతోపాటు బీజేపీ అగ్రనేతలు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారా..? అనే ప్రశ్న లక్ష్మణ్‌కు ఎదురవుతోంది.

కేవలం 21 నెలల పాలనలోనే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా పథకాలు అమలు చేసింది. విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంది. ఇచ్చిన హామీలు అమలు చేశారు కాబట్టే.. సీఎం వైఎస్‌జగన్‌ తన ప్రభుత్వం చేసిన మంచిని రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు. మరి ఏడు సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఏపీకి ఇచ్చిన హామీలలో ఏమి అమలు చేసింది..? బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఏ హామీలను అమలు చేసిందనే విషయం రాతపూర్వకంగా వెల్లడిస్తుందా..? అంత సాహసం బీజేపీ చేస్తుందా..? అంటే జాతీయ నేత అయిన లక్ష్మణ్‌తో సహా బీజేపీ నేతలు నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

Also Read : రైతులపై భారం మోపుతూ మోడీ సర్కారు నిర్ణయం, అన్నదాతల్లో కొత్త ఆందోళన

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి