iDreamPost

తిరుమల వెళ్లేవారికి ముఖ్య గమనిక.. పలు దర్శనాలను రద్దు చేసిన టీటీడీ!

  • Author singhj Published - 01:01 PM, Mon - 10 July 23
  • Author singhj Published - 01:01 PM, Mon - 10 July 23
తిరుమల వెళ్లేవారికి ముఖ్య గమనిక.. పలు దర్శనాలను రద్దు చేసిన టీటీడీ!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులు సుదూరాల నుంచి తిరుమల క్షేత్రానికి వస్తుంటారు. దూర భారాన్ని లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి తిరుమల కొండ మీదకు చేరుకుంటారు. ఆ ఏడుకొండల వెంకన్నను దర్శనం చేసుకొని తాదాత్మ్యం చెందుతుంటారు. అలాంటి శ్రీవారి భక్తులకు ఒక ముఖ్య గమనిక. వెంకన్న ఆలయంలో జులై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని.. జులై 11న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. దీంతో జులై 11వ తేదీన బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న నేపథ్యంలో జులై 10వ తేదీన సోమవారం సిఫార్సు లేఖల్ని స్వీకరించరు. ఈ విషయాన్ని భక్తులు అందరూ గమనించాలని టీటీడీ కోరింది. ఇదే కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధాన సేవను కూడా రద్దు చేసింది టీటీడీ. ఇక, ఆణివార ఆస్థానం సందర్భంగా గుడిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు మొదలై.. 5 గంటల పాటు కొనసాగుతుందని టీటీడీ తెలిపింది. తిరుమంజనం తర్వాత స్వామివారి మూలవిరాట్​కు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుమంజనం, స్వామివారి మూలవిరాట్​కు పూజా కార్యక్రమాలు ముగిశాక మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిరుమల ఆలయంలో సాధారణంగా ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది పండుగతో పాటు ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాగా, టీటీడీ వెబ్​సైట్​లో స్థానిక దేవాలయాలు, అనుంబంధ ఆలయాలు, సేవలు, దర్శన వేళలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులకు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి