iDreamPost

అపూర్వ కలయికతో తిరుగులేని మనిషి – Nostalgia

అపూర్వ కలయికతో తిరుగులేని మనిషి – Nostalgia

తెలుగు సినిమా పోకడను, వేగాన్ని శాసించిన ఇద్దరు హీరోల పేర్లు చెప్పమంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు నందమూరి తారకరామారావు గారు రెండోది మెగాస్టార్ చిరంజీవి. అన్నగారుగా అభిమానులు ప్రేమతో పిలుచుకునే ఎన్టీఆర్ తన సకలకళా నటనా దర్శకత్వ పటిమతో ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఇచ్చారు. అప్పటిదాకా తెరకు పరిచయం లేని ఒక వేగాన్ని డాన్సుల్లో ఫైట్లలో తీసుకొచ్చి చిరంజీవి సృష్టించిన శకం ఎలాంటిదో చరిత్ర తిరగేస్తే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అలాంటి ఈ ఇద్దరి కలయిక ఒకే ఒక్కసారి సాధ్యమయ్యింది. దాని పేరే తిరుగులేని మనిషి. అగ్రనిర్మాత కె దేవివరప్రసాద్ నిర్మాణంలో అప్పట్లో భారీ బడ్జెట్ తో ఇది రూపొందింది.

1980. చిరంజీవి ఇంకా నటుడిగా ఎదుగుతున్న సమయం. కృష్ణ, కృష్ణంరాజులాంటి సీనియర్లతో కలిసి నటించే అనుభవం రెండేళ్లకే వచ్చింది. ఆ క్రమంలో ఆంధ్రుల ఆరాధ్య నటుడిగా పేరొందిన ఎన్టీఆర్ తో కలిసి తెరమీద కనిపించే సువర్ణావకాశం కోసం ఎదురు చూస్తున్న సమయమది. అప్పుడే తిరుగులేని మనిషి ప్రతిపాదన తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. సత్యానంద్ రచనలో రూపుదిద్దుకున్న స్క్రిప్ట్ లో తన క్యారెక్టర్ కు నెగటివ్ షేడ్స్ ఉన్నా చిరు ఆలోచించలేదు. ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం మళ్ళీ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ కారణంగానే దేవీవరప్రసాద్ అప్పటి చిరు మార్కెట్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారట.

ఇందులో ఇద్దరు బావ బావమరుదులుగా కనిపిస్తారు. లాయరైన ఎన్టీఆర్ చెల్లెలు ఫటాఫట్ జయలక్మిని క్లబ్బుల్లో పాటలు పాడే చిరంజీవి ప్రేమిస్తాడు. మరో హీరోయిన్ రతి. చిరు పాత్రకు ప్రీ క్లైమాక్స్ కు ముందు కనువిప్పు కలుగుతుంది. జగ్గయ్య, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ముక్కామల, జయలక్ష్మి ఇతర కీలక పాత్రలు పోషించారు. కెవి మహదేవన్ స్వరాలు సమకూర్చగా కెఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణ బాధ్యతలు నెరవేర్చారు. 1981 ఏప్రిల్ 3న విడుదలైన తిరుగులేని మనిషి అంచనాలు అందుకోలేకపోయింది. అదే ఏడాది మొదటి మూడు నెలల్లో విడుదలైన ఊరికి మొనగాడు, ప్రేమాభిషేకం, గజదొంగలు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న తరుణంలో వాటికి సరితూగలేక తిరుగులేని మనిషి యావరేజ్ కంటే ఒక మెట్టు కిందే ఆగిపోయింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి