iDreamPost

మీ ప్రయోగాలకో దండం..! తిలక్‌ వర్మను కూడా నాశనం చేసేలా ఉన్నారుగా..

  • Published Aug 19, 2023 | 11:08 AMUpdated Aug 19, 2023 | 11:08 AM
  • Published Aug 19, 2023 | 11:08 AMUpdated Aug 19, 2023 | 11:08 AM
మీ ప్రయోగాలకో దండం..! తిలక్‌ వర్మను కూడా నాశనం చేసేలా ఉన్నారుగా..

ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ను 139 పరుగులకు పరిమితం చేసిన భారత్‌.. 6.5 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 47 పరుగులు చేసిన సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజేతను ప్రకటించారు. వర్షం వచ్చే సమయానికి భారత్‌ 2 పరుగులు ముందు ఉండటంతో విజయం వరించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లకు సరైన గేమ్‌ టైమ్‌ లభించలేదు. కానీ, బౌలర్లు మాత్రం పర్వాలేదనిపించారు. బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ సత్తా చాటారు. అయితే.. ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్‌ వర్మ గోల్డెన్‌ డక్‌ అవ్వడం క్రికెట్‌ అభిమానులను నిరాశపర్చింది. అయితే.. తిలక్‌ ఫెల్యూయిర్‌కు కెప్టెన్‌ బుమ్రా, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కారణమంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు.

వారి కోపానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన తిలక్‌ వర్మ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. 39, 51, 49(నాటౌట్‌), 7(నాటౌట్‌), 27 మంచి స్కోర్లు చేశాడు. ముఖ్యంగా తొలి మూడు మ్యాచ్‌ల్లో తిలక్‌ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిసింది. తిలక్‌ను టీమిండియా ఫ్యూచర్‌ స్టార్‌గా, యువీ ఆడిన 4వ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా మాజీ క్రికెటర్లు సైతం అభివర్ణించారు. వెస్టిండీస్‌పై చూపించిన సూపర్‌ టెంపోనే ఐర్లాండ్‌పై తిలక్‌ చూపిస్తాడాని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా తొలి మ్యాచ్‌లో తిలక్‌ వర్మ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తిలక్‌ డకౌట్‌కి కెప్టెన్‌ బుమ్రాతో పాటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్న చెత్త ప్రయోగాలే కారణం అనే విమర్శలు వస్తున్నాయి.

తిలక్‌ వర్మను 4వ స్థానంలో కాకుండా, వన్‌డౌన్‌లో ఆడించడం వల్లే అతను గోల్డెన్‌ డక్‌ అయ్యాడంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. తిలక్‌ వర్మ వెస్టిండీస్‌పై ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు 4వ స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ నాలుగు మ్యాచ్‌ల్లోనూ అతను సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆ ఒక్క మ్యాచ్‌ కూడా విజయానికి చేరువలో ఉందని వచ్చాడు. కానీ, ఐర్లాండ్‌తో తొలి టీ20లో తిలక్ వర్మను వన్‌డౌన్‌లో పంపాల్సిన అవసరం లేదు. గతంలో ఓపెనర్‌గా కూడా ఆడిన సంజు శాంసన్‌ను వన్‌డౌన్‌లో కూడా ఆడించే అవకావం ఉన్నా.. తిలక్‌ వర్మను పంపించారు. తిలక్‌ వర్మకు బాగా సెట్‌ అయిన 4వ స్థానంలోనే అతన్ని ఆడించి ఉంటే.. ఫలితం ఉండేది.

పైగా రానున్న ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో కూడా తిలక్‌ను నాలుగో స్థానంలోనే ఆడించాలని అనుకుంటున్నట్లు ఇప్పటికే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ రిటైర్‌ అయిన తర్వాత ఆ స్థానంలో ఏ క్రికెటర్‌ కూడా సెట్‌ కాలేదని, తిలక్‌ వర్మ జట్టుకు కీలకమైన 4వ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్నాడనే ప్రశంసలు కూడా వచ్చాయి. అలాంటి ఆటగాడిని వన్‌డౌన్‌లో ఎందుకు దింపారో అంటూ క్రికెట్‌ నిపుణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాగా ఆడుతున్న ప్లేయర్‌తో ప్రయోగాలు చేయించి తన లయను దెబ్బ తీయొద్దని కోరుతున్నారు. ఇప్పటికే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన ప్రయోగాలకు జట్టు చాలా నష్టపోయిందని, ఇప్పుడు మీ ప్రయోగాలకు తిలక్‌ వర్మ కూడా ఆగం అయ్యేలా ఉన్నాడంటూ పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: జైస్వాల్‌-రుతురాజ్‌ తత్తరపాటు! వీళ్లను మించిపోయిన ఐర్లాండ్‌ ఆటగాళ్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి