iDreamPost

ఒక్క ఇన్నింగ్స్‌తోనే చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ! తొలి భారత క్రికెటర్‌గా..

  • Published Aug 05, 2023 | 11:55 AMUpdated Aug 05, 2023 | 11:55 AM
  • Published Aug 05, 2023 | 11:55 AMUpdated Aug 05, 2023 | 11:55 AM
ఒక్క ఇన్నింగ్స్‌తోనే చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ! తొలి భారత క్రికెటర్‌గా..

టీమిండియా యువ క్రికెటర్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20తో క్రికెట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తిలక్‌.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే రెండు భారీ సిక్సులుకొట్టి.. అసలు సిసలైన టీ20 బ్యాటర్‌ ఎలా ఉండాలో.. భవిష్యత్తులో తాను ఎలా ఆడబోతున్నానో చెప్పకనే చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌలర్లకు తన ఆగమానం గురించి గుర్తు చేశాడు. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లు.. ఇక నుండి టీమిండియా తిలక్‌ తరం మొదలకానున్నట్లు కనిపిస్తోంది.

సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, సంజు శాంసన్‌ లాంటి ఆటగాళ్లు సైతం విఫలమైన చోట తిలక్‌ వర్మ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేసి.. తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు తిలక్‌. టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ఆడిన తొలి మ్యాచ్‌లోనే కనీసం 30 పరుగులు చేసి అత్యధిక స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర లిఖించాడు. వెస్టిండీస్‌పై తిలక్‌ తన తొలి టీ20 మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ఈ రికార్డుతో పాటు దిగ్గజ మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ సరసన కూడా నిలిచాడు. నిజానికి రాహుల్‌ ద్రావిడ్‌పై టెస్ట్‌ స్పెషలిస్ట్‌ క్రికెటర్‌ అనే ముద్ర ఉంది. కానీ, ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. టీమిండియా తరపున తొలి టీ20 మ్యాచ్‌ ఆడుతూ.. అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు ద్రావిడ్‌ పేరునే ఉండటం విశేషం. 2011లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో రాహుల్‌ ద్రావిడ్‌ మూడు సిక్సులు బాదాడు. అదే ద్రావిడ్‌ కెరీర్‌లో తొలి టీ20 మ్యాచ్‌. అలాగే 2010లో కూడా మురళీ విజయ్‌ సైతం తన తొలి టీ20లో మూడు సిక్సులు కొట్టాడు. ఇప్పుడు వీరిద్దరి సరసన తిలక్‌ వర్మ కూడా చేరారు. డెబ్యూ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డును వీరు ముగ్గురు సంయుక్తంగా కలిగి ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌తో తిలక్‌ వర్మ ప్రదర్శనతో పాటు సాధించిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బుమ్రా రిటైర్మెంట్ తీసుకోవాలంటున్న దిగ్గజ బౌలర్.. లేకపోతే చాలా కష్టమంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి