iDreamPost

రోహిత్‌ శర్మ తర్వాత మన వర్మే! తిలక్‌ ఖాతాలో అరుదైన రికార్డు

  • Published Aug 07, 2023 | 8:06 AMUpdated Aug 07, 2023 | 8:06 AM
  • Published Aug 07, 2023 | 8:06 AMUpdated Aug 07, 2023 | 8:06 AM
రోహిత్‌ శర్మ తర్వాత మన వర్మే! తిలక్‌ ఖాతాలో అరుదైన రికార్డు

టీమిండియా యువ క్రికెటర్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మ మరోసారి టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌కు వెన్నుముకలా నిలిచాడు. తొలి మ్యాచ్‌లో 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన తిలక్‌.. రెండో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మళ్లీ తానే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రెండో మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓటమి పాలైనప్పటికీ తిలక్‌ ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా రెండో టీ20లో తిలక్‌ ఆడకపోయి ఉంటే.. కచ్చితంగా టీమిండియా అత్యంత దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చేంది. తిలక్‌ హాఫ్‌ సెంచరీతో రాణించడంతోనే కాస్త గౌరవ ప్రదమైన ఓటమి దక్కిందనే చెప్పాలి. మ్యాచ్‌ సంగతి పక్కన పెడితే.. ఈ ఇన్నింగ్స్‌తో తిలక్‌ వర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్‌ సెంచరీతో అతి చిన్న వయసులో టీమిండియా తరపున హాఫ్‌ సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్‌గా తిలక్‌ వర్మ నిలిచాడు. 20 ఏళ్ల 271 రోజుల వయసులో తిలక్ వర్మ తొలి టీ20 హాఫ్ సెంచరీ సాధించాడు. తిలక్‌ కంటే ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్‌ 20 ఏళ్ల 143 రోజుల వయసులో టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఇక రిషభ్ పంత్ (21 ఏళ్ల 38 రోజులు), రాబిన్ ఊతప్ప (21 ఏళ్ల 307 రోజులు), సురేశ్ రైనా (22 ఏళ్ల 90 రోజులు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. పంత్‌, ఊతప్ప, రైనా రికార్డులను బద్దుల కొడుతూ తిలక్‌ రెండో స్థానంలోకి దూసుకెళ్లాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. తిలక్‌ వర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్‌తో 51 పరుగులు చేశాడు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(27), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(24) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌ దారుణంగా విఫలం అయ్యారు. దీంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితం అయింది. విండీస్‌ బౌలర్లలో అకెల్‌ హోస్సెన్‌, అల్జారీ జోసెఫ్‌, షెఫర్డ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇక 153 పరుగుల టార్గెట్‌ను విండీస్‌ 18.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. నికోలస్‌ పూరన్‌(67), కెప్టెన్‌ పావెల్‌, హెట్‌మేయర్‌ రాణించడంతో విండీస్‌కు విజయం సులువైంది. భారత బౌలర్లలో పాండ్యా, చాహల్‌ మూడేసి వికెట్ల పడగొట్టారు. అర్షదీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌ చెరో వికెట్‌ తీసుకోగా.. రవి బిష్ణోయ్‌కి ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శనతో పాటు తిలక్‌ సాధించిన అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విండీస్‌ చేతిలో టీమిండియా చిత్తు! ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి