iDreamPost

విండీస్‌ చేతిలో టీమిండియా చిత్తు! ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే

  • Published Aug 07, 2023 | 7:35 AMUpdated Aug 08, 2023 | 7:37 AM
  • Published Aug 07, 2023 | 7:35 AMUpdated Aug 08, 2023 | 7:37 AM
విండీస్‌ చేతిలో టీమిండియా చిత్తు! ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే

ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా తన పరువును తానే చేజేతులా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వన్డే వరల్డ్‌ కప్‌కు క్వాలిఫై కాలేకపోయిన జట్టు చేతుల్లో వరుసగా రెండో దారుణ ఓటమిని చవిచూసింది. గాయాన వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ తేలిపోయింది. వెరసి.. ఐదు టీ20ల సిరీస్‌లో 0-2తో టీమిండియా వెనుకబడింది. సిరీస్‌ గెలవాలంటే ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రెండో టీ20లో ఎదురైన ఓటమితో భారత క్రికెట్‌ అభిమానులు టీమిండియా ఆటగాళ్లపై ఫైర్‌ అవుతున్నారు. అయితే ఈ ఓటమిపై క్రికెట్‌ నిపుణులు స్పందిస్తూ.. ఓటమికి కారణాలను విశ్లేషించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చెత్త బ్యాటింగ్‌.. స్టార్లు బేకార్లు..!
ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త బ్యాటింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే చెప్పాలి. తెలుగు క్రికెటర్‌, తన కెరీర్‌లో కేవలం రెండో అంతర్జాతీయ మ్యాచ్‌ మాత్రమే ఆడుతున్న తిలక్‌ వర్మ ఒక్కడిని పక్కనపెడితే.. జట్టు మొత్తం దారుణంగా విఫలమైంది. ఇషాన్‌ కిషన్‌, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా 20కి పైగా పరుగులు చేసినా అవి పెద్దగా చెప్పుకోదగిన స్కోర్లయితే అస్సలు కాదు. ఇక టీ20 స్టార్లుగా పేరున్న శుబ్‌మన్‌ గిల్‌(7), మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌(1), సంజు శాంసన్‌(7) చాలా అంటే చాలా దారుణంగా విఫలం అయ్యారు. టీమిండియాకి వీరి ముగ్గురిని ప్రధాన కారణం అని చెప్పడంలో అసలు ఎలాంటి సందేహం లేదు.

హార్దిక్‌ పాండ్యా చెత్త కెప్టెన్సీ..!
టీ20లకు అనాధికారికంగా రెగ్యులర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యా తన మిడిమిడి కెప్టెన్సీ జ్ఙానంతో టీమిండియా కొంపముంచుతున్నాడు. అతని బౌలింగ్‌ మార్పుల గురించి.. ఇప్పుడిప్పుడే క్రికెట్‌ నేర్చుకుంటున్న కుర్రాడ్ని అడిగినా.. ఇదో చెత్త కెప్టెన్సీ అని ముఖం మీదే చెప్పేస్తారు. అంత దారుణంగా ఉంది పాండ్యా కెప్టెన్సీ. ముఖ్యంగా సూపర్‌ స్వింగ్‌లో ఉన్న చాహల్‌ను సరిగా ఉపయోగించుకోకపోవడంపైనే పాండ్యాపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 18వ ఓవర్‌ చాహల్‌తో వేయించి ఉంటే.. మరో వికెట్‌ పడి ఉండేదని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో మరో హైలెట్‌ ఏంటంటే 3 వికెట్ల తీసుకుని, అందరి కంటే తక్కువ పరుగులు ఇచ్చిన చాహల్‌ తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. పోని చివరి ఓవర్‌ వరకు అతన్ని హోల్డ్‌ చేశారు అని అనుకుంటే.. అసలు మ్యాచ్‌ చేజారుతుంటే.. ఫామ్‌లో ఉన్న బౌలర్‌ను ఆపి పెట్టుకోవడం ఎందుకు మ్యాచ్‌ అయిపోయిన తర్వాత నెత్తిన కొట్టుకోవడానికా? అని ఫ్యాన్స్‌ అంటున్నారు. అలాగే ఈ మ్యాచ్‌లో పాండ్యా కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. చాహల్‌కు మరో ఓవర్‌ ఇస్తే.. తన కంటే ఎక్కువ వికెట్లు తీస్తాడేమోనని పాండ్యా భయపడ్డాడని కూడా క్రికెట్‌ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

ఫేలవ బౌలింగ్‌..!
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌ మినహా మిగతా బౌలర్లంతా విఫలం అయ్యారు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్ల పడగొట్టినా.. 4 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. టీమిండియా ఇచ్చిందే కేవలం 153 పరుగుల నామమాత్రపు టార్గెట్‌. ఇలాంటి టార్గెట్‌ను రక్షించుకోవాలంటే.. వికెట్లు తీయడంతో పాటు చాలా పొదుపుగా బౌలింగ్‌ చేయాలి. ఇక పాండ్యాతో పాటు అర్షదీప్‌ సింగ్‌ 34, ముఖేష్‌ కుమార్‌ 35, రవి బిష్ణోయ్‌ 31 బాగానే పరుగులు సమర్పించుకున్నారు. చాహల్‌ ఒక్కడే 3 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనిపించాడు. ఇలా టీమిండియా ఓటమికి ఈ మూడు ప్రధాన కారణాలుగా నిలిచాయి. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్ శర్మను ఘోరంగా అవమానించిన స్టార్ స్పోర్ట్స్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి