iDreamPost

కుటుంబ కలహాలతో అలరించిన డ్రామా – Nostalgia

కుటుంబ కలహాలతో అలరించిన డ్రామా – Nostalgia

మాములుగా ఫ్యామిలీ డ్రామాలతో అన్ని వర్గాలను అందులోనూ ముఖ్యంగా మాస్ ని మెప్పించడం కష్టం. ఎంత కుటుంబ ప్రేక్షకులను ఉద్దేశించి తీసినా అన్ని అంశాలను సరిగ్గా రంగరించగలిగితే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సొంతం చేసుకోవచ్చని గతంలో ఎన్నో సినిమాలు ఋజువు చేశాయి. ఓ మంచి ఉదాహరణ తోడి కోడళ్ళు. 1993 సంవత్సరం. స్టార్ హీరోలతో ఎన్ని చిత్రాలు తీసినా క్రమం తప్పకుండా బడ్జెట్ మూవీస్ చేస్తూ తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు సూత్రాన్ని ఫాలో అయ్యేవారు సురేష్ సంస్థ అధినేత డాక్టర్ డి రామానాయుడు గారు. అయితే ఈసారి రచయితలు పరుచూరి బ్రదర్స్ ఓ వినూత్న ప్రతిపాదనతో వచ్చారు.

ఒక ఉమ్మడి కుటుంబంలో స్వచ్ఛమైన ప్రేమను పంచుకుంటున్న అన్నదమ్ములు, తోడి కోడళ్ళ మధ్య సఖ్యతను విడదీసేందుకు కొన్ని శక్తులు పూనుకున్నప్పుడు జరిగే డ్రామాను ఆధారంగా చేసుకుని నాయుడు గారికి ఓ స్క్రిప్ట్ వినిపించారు. అయితే ఇది కాస్త ఎక్కువ బడ్జెట్ డిమాండ్ చేస్తోంది. పైగా సినిమా స్కోప్ లో తీయాలనే ప్రపోజల్ కూడా పెట్టారు. లోతుగా విశ్లేషించిన రామానాయుడు దర్శకుడు బోయిన సుబ్బారావుతో పలు దఫాలు చర్చించిన మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. టైటిల్ రోల్స్ జయసుధ, లక్ష్మి పోషించగా సురేష్, మురళి మోహన్, చంద్రమోహన్, సుధాకర్, శ్రీహరి, చలపతి రావు, షావుకారు జానకి, గోకిన రామారావు తదితరులతో భారీ క్యాస్టింగ్ సెట్ చేసుకున్నారు. అలనాటి ఏఎన్ఆర్ క్లాసిక్ తోడికోడళ్లు టైటిల్ నే వాడాలని నిర్ణయించుకున్నారు.

రాజ్ కోటి స్వరాలందించగా, ప్రతాప్ ఛాయాగ్రహణం సమకూర్చారు. కుటుంబంలోని అపార్థాలు, మనుషుల మధ్య ఉండాల్సిన విలువలను చాలా చక్కగా ఆవిష్కరించారు సుబ్బారావు. మాలాశ్రీ, వాణి విశ్వనాథ్ ల పోటాపోటీ నటన ఆకట్టుకుంది. క్లైమాక్స్ కోసం పది లక్షలు ఖర్చు పెట్టడం అప్పట్లో రికార్డు. కథ ప్రకారం అందరూ కలిసి ఉండే గ్రామీణ తరహా పెద్ద ఇంటిని ప్రత్యేకంగా సెట్ వేయించి మరీ తీశారు రామానాయుడు గారు. 1994 మార్చ్ 31 బాపు పెళ్లికొడుకుతో పాటు తోడికోడళ్లు అదే రోజు రిలీజయ్యింది. మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. స్టార్లు లేకపోయినా ఈ సినిమా ఏకంగా వంద రోజులు ఆడటం ట్రేడ్ కి రామానాయుడు జడ్జ్ మెంట్ పట్ల నమ్మకం రెట్టింపు అయ్యేలా చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి