iDreamPost

కియా ఆంధ్రాను వీడదు.. ఎందుకంటే.. ?

కియా ఆంధ్రాను వీడదు.. ఎందుకంటే.. ?

అయిపొయింది అంతా అయిపోయింది …అన్ని పోయాయి.. చంద్రబాబు ఓటమితోనే ఇన్ని సమస్యలు.. ఆయనే ఉంటేనా? వైజాగ్ సుమ్మిట్లో చేసుకున్న MoU లలో 100% వాస్తవ రూపం దాల్చి 16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి… ఉదయం నుంచి ఇవే వార్తలు…

KIA(కియా) కార్ల కంపెనీ అనంతపురం నుంచి తమిళనాడు తరలిపోవటానికి నిశ్చయించుకుంది అని రాయిటర్స్ , మరో పత్రికలో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని వివరీతమైన ప్రచారం జరుగుతుంది. ఆ కధనంలో అనధికార వర్గాలు అంటూ కోట్ చేసి ఊహాజనిత వార్తను వండి వార్చారు. గతంలో కూడా కియా మహారాష్ట్రకు తరలిపోతుందని వార్తను ప్రచారం చేశారు.

ఏ కంపెనీ అయినా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలి పోవటానికి చాలా పెద్ద కారణాలు ఉండాలి. టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిచింది కాబట్టి కియా కు కష్టాలు ఎదురవుతున్నాయి.. ఒక సందర్భంలో ఎంపీ గోరంట్ల మాధవ్ దురుసుగా ప్రవర్తించాడు..ఇలాంటి కారణాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటానికి పనికొస్తాయి కానీ కంపెనీల నిర్ణయాల మీద ఇలాంటి కారణాలు ప్రభావం చూపవు.

కియా తొలి కారు మూడు నెల కిందట మార్కెట్లోకి వచ్చింది. కియా టార్గెట్ ప్రకారం కార్ల ఉత్పత్తి జరుగుతోంది. హైదరాబాద్ లాంటి నగరంలో కొత్త కార్ డెలివెరీకి ప్రస్తుతం ఆరు వారాల నుంచి 2 నెలల వెయిటింగ్ టైం ఉంది. ఇలాంటి దశలో రెండో ప్లాంట్ విస్తరణ పనులను వేగంగా మొదలు పెడతారు కానీ పక్క రాష్ట్రంతో చర్చలు చేసి ప్లాంటును అక్కడికి తరలించటమో లేక రెండవ ప్లాంటును అక్కడ ఏర్పాటు చేయటమో ఏ కంపెనీ చెయ్యదు. ఇప్పుడు కొందరు ప్రచారం చేస్తున్నట్లు తమిళనాడుకు కియాకంపెనీని తరలించాలంటే ఎన్ని వందల కోట్ల ఖర్చు అవుతుంది? ఉత్పత్తి ప్రారంభించటానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది?

మరో వైపు అమ్మకాలు మందగించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది. ఎక్కువ మంది సొంత కార్లు వాడకుండా ఉబర్, ఓలా లాంటి క్యాబ్స్ ను వాడటం వలన మన దేశంలో కార్ల అమ్మకాలు తగ్గాయని ఆర్ధిక మంత్రి ఆ మధ్య అన్నారు. కంపెనీల నిర్ణయాలు ఇలాంటి అంశాల ఆధారంగా, వచ్చే ఐదు పది సంవత్సరాల మార్కెట్ అంచనాల మీద ఆధారపడి ఉంటాయి కానీ రాజకీయ కారణాలతో కంపెనీలు తరలిపోవు.

జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత ఉద్యోగాలలో స్థానికులకే 75% ఇవ్వాలని ఇచ్చిన జీవో వలన స్కిల్ల్డ్ వర్కర్లు దొరక్కా కియా కంపినీ ఇబ్బంది పడుతుందని, అందుకే తమిళనాడుకు తరలిపోవాలని భావిస్తుందని ఒక ప్రోపగండా ప్రచారంలో పెట్టారు. ఇదో డొల్ల వాదన.. ప్రస్తుతం కియా కంపెనీలో 12,000 ఉద్యోగస్తులు ఉన్నారు. వీరిలో 85% మంది స్థానికులేనని ఒక ఉన్నతస్థాయి అధికారి చెప్పారు. ఒక వేళ స్థానికులకే (పేర్మినెంట్ ఉద్యోగులు సంఖ్యలో ) 75%  ఉద్యోగాలు అన్న నిబంధన వల్ల ఇబ్బందులు నిజమైతే… కియా యాజమాన్యం ప్రభుత్వంతో చర్చించి 75% నిబంధనకు మినహాయింపు తెచ్చుకుంటుంది. అంతే కానీ వందల కోట్లు ఖర్చు పెట్టి తమిళనాడుకు వెళ్లి అక్కడ మళ్లి భూమి, నీరు, సమయం, మానవ వనరుల సమీకరణ కోసం కష్టపడదు. దీని కోసం మరో 2-3 సంవత్సరాలు ఉత్పత్తి ని ఆపరు. ఉద్యోగాలలో స్థానికులకు 75% ఇవ్వాలన్న నిబంధన ఇప్పటికిప్పుడు కియాకు వర్తించదు కూడా

కియా కరువు జిల్లా అనంతపురం నుంచి తరలిపోతే ఉద్యోగాలు పోతాయని రాజకీయ సానుభూతిని చూపిస్తున్న వాళ్ళు కియా అనంతపురంలోనే రావటానికి ముఖ్యకారణాలలో ఒకటైన నీటిని విస్మరిస్తున్నారు. హంద్రీ-నీవా పథకంలో భాగంగా నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి కియా కంపెనికి 0.3 టిఎంసిల నీటిని కేటాయించారు.

రాష్ట్ర GST మొత్తం సబ్సిడీగా కియాకు ఇస్తున్నారు. 25 సంవత్సరాలు లేదా క్యాపిటల్ కాస్ట్ కు సరిపడా మొత్తం GST కింద ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. దీని విలువ 10,000 కోట్లకు పైమాటే. పవర్ బిల్లులో 75% సబ్సిడీ, వాటర్ 75% సబ్సిడీ.. ఇవి మొత్తం కలిపితే సాలీనా 1800 కోట్ల నుంచి 2000 కోట్లు ఉంటుంది.

కియా పరిశ్రమ, దాని అనుబంధ  పరిశ్రమల ఏర్పాటుకు మొత్తం 2000 ఎకరాలు భూమిని సేకరించారు. అందులో 1000 ఎకరాలు కియా కంపెనీకి ఇచ్చారు. అందులో 500 ఎకరాలను ప్రభుత్వమే లెవల్ చేసి మరి ఇచ్చింది. మొత్తంగా 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చుపెట్టింది.

ఎక్కడికి కియా పోయేది? ఈ లెక్కలు చూస్తే అర్ధం అవుతుంది. కియా ఎక్కడికి పోదు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఇంత ఏకపక్షంగా ఒక కంపెని ఏర్పాటుకు ఖర్చు పెట్టదు. సబ్సిడీలు ఇవ్వదు.

కియా వలన పది ఉద్యోగాలు వచ్చాయి కానీ ప్రభుత్వ ఖజానాకు చిల్లుపడింది. గట్టిగా మాట్లాడితే కియా కు ఇస్తున్న ఇన్సెంటివ్స్ ను ప్రభుత్వం రివ్యూ చెయ్యాలి.

రెండవ ప్లాంట్ ఏర్పాటుకు కూడా మొదటి దశలో ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కియా యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరుతుంది. దాన్ని బేస్ చేసుకొని కొన్ని పత్రికలూ కియా తరలిపోతుందని వార్తలు అల్లుతున్నాయి . కానీ కియా యాజమాన్యం మాకు అటువంటి ఆలోచన లేదని బహిరంగ ప్రకటన చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా వారితో కియా యాజమాన్యం చర్చించలేదని ఈ ఉదయం ప్రకటించింది. అయినా కానీ కియా తరలిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి