iDreamPost

సంక్షోభంలోనే నాయకుడి సత్తా తెలిసేది

సంక్షోభంలోనే నాయకుడి సత్తా తెలిసేది

ఏదైనా సంక్షోభం ఎదురైతేనే నాయకుడి సత్తా తేలుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. చెప్పాపెట్టకుండా వచ్చిపడ్డ ఉపద్రవాన్ని ప్రజలకు ఇబ్బంది కలక్కుండగా ఎదుర్కొవడం ద్వారా పాలనాదక్షత బహిర్గతమవుంది. ఇటువంటి పాలనా పటిమ ఉంటే సొంతబ్యాచ్‌లు బాకా కొట్టక్కర్లేదు, జాకీలేయక్కర్లేదు.. అనాయాసంగానే దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతాయి. గత పదేళ్ళుగా తన ‘సత్తా’ను సమయం వచ్చిన ప్రతిసారీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరూపించుకుంటూనే ఉన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని అధికార పక్షం ఎన్నిరకాలుగా తనను టార్గెట్‌ చేసినప్పటికీ ధైర్యంగా నిలబడడంతో పాటు, తనను నమ్ముకునున్న క్షేత్రస్థాయి కార్యకర్త వరకు ఆ నమ్మకాన్ని సడలకుండా కాపాడగలిగారు.

తాజాగా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తూ సత్తాను మరోసారి చూపారు. ‘కరోనాతో సహజీవనం చెయ్యాల్సిందే’ అని నాలుగు నెలల క్రితం సీయం హోదాలో జగన్‌ చెబితే ప్రతిపక్షాలు హేళనకు దిగాయి. చేతగాక ఇటువంటి చెబుతున్నారు అంటూ నోరు పారేసుకున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ మాటకొస్తే ప్రధానమంత్రి సైతం ఇదే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ఇది ఇప్పటిప్పుడు ఊఫ్‌మని ఊదేస్తే పోయేది కాదని, మనతోపాటే ఉంటుందని, అందుకు అనుగుణంగా మన జీవనాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుందని వివరిస్తున్నారు. కానీ ప్రాథమిక దశలోనే వాస్తవికంగా ఆలోచించి చెప్పిన జగన్‌పై మాత్రం బురదజల్లుడుకు పోటీపడ్డారు. వాస్తవిక దృక్ఫధంలో ఆలోచిస్తే జగన్‌ చెప్పిందే నూటికి నూరుపాళ్ళు నిజమైంది. అంటే ఇతర ‘సీనియర్‌’ నాయకులకంటే ఈ విషయంలో జగన్‌ నాలుగు అడుగులు ముందుగానే ఆలోచించారన్నది స్పష్టమైంది.

కరోనాను ఎదుర్కొవడంలో విజయవంతమైన విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తోంది. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ పద్దతిలో ముందుకు సాగుతోంది. దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏపీలో లేవని వైద్య నిపుణులే చెబుతున్నారు. ప్రతి రోజూ పాతికవేలకుపైగా పరీక్షలు చేస్తున్న కారణంగానే.. ప్రస్తుతం బైట పడుతున్న కేసులు అన్నది వారి వివరణ. ఇతర రాష్ట్రాలకంటే టెస్టుల విషయంలో ఏపీ టాప్‌లో ఉంది. కోవిడ్‌ 19 లాంటి విపత్కర పరిస్థితుల్లో మారుమూలన ఉన్న రోగులకు కూడా ఎంతో ఉపయోక్తంగా ఉండే అంబులెన్స్‌లను ఉన్నపళంగా అందుబాటులోకి తీసుకురావడం దేశ వ్యాప్తంగా ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ పనితనానికి మెచ్చుకోళ్ళు లభించాయి. 1088 అంబులెన్స్‌లను ఒకే రోజు ఎటువంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా రాష్ట్రం నలుమూలలకు పంపించారు. లైఫ్‌ సపోర్ట్‌ పరికరాలతో సిద్ధమైన ఈ అంబులెన్స్‌లను ప్రస్తుతం ఉన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలందించేందుకు తోడ్పడతాయనడంలో సందేహం లేదు.

వీటికి తోడుగా సంజీని పేరుతో కోవిడ్‌ టెస్టులు చేసేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి పరీక్షలు చేసేందుకు కార్యాచరణ అమలు పరుస్తున్నారు. ఈ సంజీవని బస్సుల ద్వారా ఒకే సారి పది మంది నుంచి స్వాబ్‌ సాంపిల్స్‌ సేకరించే విధంగా ఈ బస్సులను తీర్చిదిద్దారు. దీంతో మారుమూలన ఉన్న రూరల్‌ ప్రాంతాల్లో సైతం కోవిడ్‌ 19ను ట్రేస్‌ చేసేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసారు.

ఇదిలా ఉండగా లాక్డౌన్‌ కాలంలో ఇళ్ళలోనే ఉండిపోయిన ప్రజలకు ఆదాయం లేదన్న లోటు తెలియనీయకుండా చేసారు. ఒక పక్క సంక్షేమ పథకాల పేరుతో డబ్బును అందుబాటులో ఉంచారు. మరోపక్క నెలకు రెండుసార్లు రేషన్‌ ఇస్తూ పేద కుటుంబాలు ఆకలిభారిన పడకుండా ఆదుకున్నారు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మార్కెట్‌ వ్యవస్థ స్థంభించిపోగా ఏపీలో మాత్రం ఒక మోస్తరు ఒడిదుడుకులతోనే సరిపెట్టుకుంది. ఇందుకు సీయం జగన్‌ అనుసరించిన సంక్షేమ ఆర్ధిక విధానాలే కారణమన్నది నిపుణుల అభిప్రాయం. పాలన ఎక్కడా ఆగకుండానే, ఒక సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు, సంక్షేమానికి కూడా ఎటువంటి ఆటంకాల్లేకుండా అమలు చేసారు. ముందుగా కేలెండర్‌ విడుదల చేసి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

సంక్షోభాలు ఏర్పడాలని ఎవ్వరూ కోరుకోకపోయినా.. సత్తా ఉన్న నాయకుడు ఉంటే ఎంతటి సంక్షోభంలో అయినా కూడా ప్రజలు స్థిమితంగా జీవించగలుగుతారనడానికి ఏపీ సీయం వైఎస్‌ జగనే ఉదాహరణ అన్నది పలువురు విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి