iDreamPost

అమెరికా ఫస్ట్‌ లేడీ మెచ్చిన ‘కేజ్రీ’ హ్యాపీనెస్‌ క్లాస్‌

అమెరికా ఫస్ట్‌ లేడీ మెచ్చిన ‘కేజ్రీ’ హ్యాపీనెస్‌ క్లాస్‌

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయానికి దోహదం చేసిన కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది విద్యా వ్యవస్థలో సంస్కరణలు. కార్పొరేట్‌ స్కూళ్లను మించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది ఆప్‌ ప్రభుత్వం. ఈ విద్యా విధానం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆకర్షించింది. ఎన్నో ప్రత్యేక బందాలు వెళ్లి.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలను పరిశీలిస్తుంటాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కూడా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి కనబరించింది. అక్కడ ఆప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ్యాపీనెస్‌ క్లాస్‌ గురించి తెలుసుకుని విద్యార్థులతో సరదాగా గడిపింది. అమెరికా ఫస్ట్‌ లేడీనే ఆకర్షించేంతగా ఆ హ్యాపీనెస్‌ క్లాస్‌లో ఏముంది? ఆ క్లాస్‌ ఉద్ధేశమేంటి? దాని ఏర్పాటుకు దోహదం చేసిన అంశాలేవి?

ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు గోడల మధ్య విద్యార్థులు మెదడులలోకి బలవంతంగా ఎక్కించే చదువులు, నర్సరీ స్థాయిలోనే కేజీల బరువుతో పుస్తకాలు, చిన్నప్పటి నుంచే స్థాయికి మించి కోచింగ్‌లు.. ఇదీ టూకీగా నేటి మన దేశంలోని చదువుల కల్చర్‌. ప్లే స్కూల్‌ పేరుతో రెండు సంవత్సరాల వయసుకే పిల్లలను చదువుల ఊబిలోకి దించేస్తున్నారు తల్లిదండ్రులు. అనుక్షణం మార్కులు, ర్యాంకులతోనే పోటీ పడుతూ యువత జీవితం యాంత్రికంగా మారిపోతోంది. పేదలు తిండి కోసం, మధ్య తరగతి ప్రజలు అవసరాల కోసం, ధనికులు ఇంకాస్త ధనికులుగా మారడం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు. ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ముఖంపై చిరునవ్వులు మాయమవుతున్నాయి. వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ ప్రకారం.. 155 దేశాల ర్యాంకింగ్స్‌లో భారతదేశం 133వ ర్యాంక్‌లో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలోనే సంతోషకరమైన జీవితాన్ని చిన్నతనం నుంచే అలవాటు చేసే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేసింది. 2018 జూలైలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాలు వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పాఠ్య ప్రణాళికలను తీసుకొచ్చారు. ఇందులో హ్యాపీనెస్‌ క్లాస్‌ అనేది ఒక భాగం. దీన్ని నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు అమలు చేస్తారు. ఆయా తరగతులను మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో నర్సరీ నుంచి రెండో తరగతి విద్యార్థులు ఉంటారు. రెండో గ్రూపులో మూడు నుంచి 5 తరతుల విద్యార్థులు, మూడో గ్రూపులో ఆరు నుంచి 8వ తరగతి విద్యార్థులు ఉంటారు. వీరికి 45 నిమిషాల పాటు హ్యాపీ నెస్‌ క్లాస్‌ ఉంటుంది. ఈ సమయంలో వారి తరగతులకు సంబంధించిన, చదువుకు సంబంధించిన అంశాల ప్రస్తావన ఉండదు. ప్రతి క్లాస్‌కు ఒక టీచర్‌ను ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ తరగతుల్లో విద్యార్థుల ఆలోచనలను స్వేచ్ఛగా బయటకు చెప్పవచ్చు. తమకు తోచిన విషయాలను ఇతరులతో పంచుకోవచ్చు. ఎలాంటి జంకు బొంకు లేకుండా గ్రూపు డిస్కషన్స్‌లో పాల్గొనేలా మోటివేట్‌ చేస్తారు. వారిపై వారికి కాన్ఫెడెన్స్‌ పెంచేలా కషి చేస్తారు. కొద్ది సేపు యోగా చేయిస్తారు. విద్యార్థులకు వ్యక్తిగతం ఉన్న ఆసక్తుల గురించి తెలుసుకుంటారు. కథలు చెప్పడం, డాన్స్‌లు, పాటలు ఇలా ఏవైనా చేయొచ్చు. ఇలా వారిలోనే సజనాత్మకతను అందరి ముందు ప్రదర్శించడం ద్వారా వారిలో కాన్ఫిడెన్స్‌ స్థాయి పెరుగుతుంది.

ఇలా 45 నిమిషాల హ్యాపీనెస్‌ క్లాస్‌ను రూపొందించారు. దీనిద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, పలు విషయాల గురించి అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. అందుకే అన్ని ప్రభుత్వాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. చివరికి అమెరికా వరకు ఈ విధానం తాలూకూ విజయం చేరింది. అందుకే అమెరికా ప్రథమ మహిళ ఆ హ్యాపీనెస్‌ క్లాస్‌ను సందర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి