iDreamPost

మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం.. సీఎం జగన్ ప్రకటన

మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం.. సీఎం జగన్ ప్రకటన

విశాఖ ఎల్జి పాలిమర్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. సమీక్ష తర్వాత మీడియా తో మాట్లాడారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి 25 వేల రూపాయల చొప్పున, ఆస్పత్రిలో రెండు మూడు రోజుల పాటు ఉండి వైద్యం తీసుకున్న వారికి లక్ష రూపాయల చొప్పున, వెంటిలేటర్పై చికిత్స తీసుకొన్న వారికి పది లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. బాధిత గ్రామాల్లో 15 వేల మంది ఉన్నారని చెప్పిన సీఎం జగన్, వారందరికీ ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన జంతువులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

కంపెనీ తరఫున పరిహారం ఇప్పిచేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలు లోని ఒక్కొక్కరికి ఎల్జీ కంపెనీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీని విచారణ కోసం నియమిస్తున్నట్లు తెలిపారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒకవేళ కంపెనీ వేరే ప్రాంతానికి తరలించాలని వస్తే కచ్చితంగా తరలిస్తామని వెల్లడించారు. ఎల్జీ లాంటి మల్టీనేషనల్ కంపెనీలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. గ్యాస్ లీక్ అయిన వెంటనే అలారం ఎందుకు మోగలేదో అర్థం కావడం లేదన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇలాంటివి మరోసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

రెండు రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్ లు.. స్థానికంగా ఉండి సహాయక చర్యలు చేపడతారని సీఎం జగన్ చెప్పారు. బాధిత గ్రామాల లో ఏమి అవసరం వచ్చిన తక్షణమే తీర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులకు మంచి పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ వినయ్ చంద్ కు సూచించారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి