iDreamPost

అధ్వానీ కల మోదీ నెరవేస్తున్నారు

అధ్వానీ కల మోదీ నెరవేస్తున్నారు

భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక సభ్యుడు, బీజేపీ కురు వృద్ధుడు, తన గురువు అయిన లాల్‌కృష్ణ అధ్వాని కలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి నలుగుతున్న అయోధ్యలోని రామమందిర నిర్మాణం వ్యవహారం కొలిక్కి వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామమందిరానికి కేటాయిస్తూ దేశ అత్యుతన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆలయ నిర్మాణానికి ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కూడా సుప్రిం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మూడు నెలల గడువు ఇచ్చింది.

సుప్రిం ఇచ్చిన గడవు ఈ నెల 9వ తేదీతో ముగస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రామమందిర నిర్మాణానికి సంబంధించిన ట్రస్ట్‌ను ఏ ర్పాటు చే సింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ నిన్న బుధవారం లోక్‌సభలో ప్రకటించారు. ‘‘శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర’’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సుప్రిం కోర్టు సీనియర్‌ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్, ఆయోధ్య కేసులో రామ్‌లాల, హిందూ పక్షాల తరఫున వాదించిన కేశవ అయ్యంగార్‌ పరాశరన్‌ను చైర్మన్‌గా నియమించారు. మొత్తం 15 మంది సభ్యులు గత ట్రస్ట్‌ కమిటీలో ఒక దళితుడు సభ్యుడుగా ఉంటారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. వీరిలో 9 మంది శాశ్వత సభ్యులు, ఆరుగురు నామినేటెడ్‌ సభ్యులు ఉండనున్నారు. ఆలయ నిర్మాణం అంతా ట్రస్ట్‌ పర్యవేక్షణలో జరగనుంది. ఆయోధ్య చట్టం కింద ప్రాంగణం వెలుపల, బయట మొత్తం 67.703 ఎకరాలు ఈ ట్రస్ట్‌కు బదలాయించారు. మసీదు నిర్మాణానికి ప్రస్తుత స్థలానికి 18 కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాలు కేటాయించారు.

సభ్యులందరూ సాధుపుంగవులు.. హిందువులు..

ట్రస్ట్‌లోని సభ్యుల పేర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సభ్యులందరూ హిందువులు, సాధుపుంగవులనే నియమించింది. శాశ్వత సభ్యులుగా.. ప్రయాగ్‌ రాజ్‌ జ్యోతిష పీఠాధిపతి స్వామి వాసుదేవానంద్, ఉడిపి మఠాధిపతి జగద్గురు మాధవాచార్య స్వామి విశ్వ ప్రసన్న తీర్థ, హరిద్వార్‌కు చెందిన యాగపురుష్‌ పరమానంద్, పుణేకు చెందిన స్వామీ గోవిందదేవ్, అయోధ్య రాజకుటుంబీకుడు విమలేందు మోహన్‌ ప్రతాప్‌ మిశ్ర, అయోధ్యలో హోమియో డాక్టర్‌ అనిల్‌ మిశ్ర, వీహెచ్‌పీ శిలాన్యాస్‌ సమయంలో పునాది రాయి వేసిన పట్నాకు చెందిన కమలేశ్వర్‌ చౌపాల్‌ (దళితుడు), నిర్మోహీ అఖాడా చీఫ మహంత్‌ ధీరేంద్ర దాస్‌లను నియమించారు. ఇక.. ట్రస్ట్‌ ఎంపిక చేసుకునే ఇద్దరు వ్యక్తులుతోపాటు.. కేంద్ర సర్వీస్‌లో ఉన్న జాయింట్‌ సెక్రటరీ హోదా గల ఐఏఎస్‌ అధకారి, రాష్ట్ర ప్రభుత్వ ఐఏఎస్‌ అధికారి, అయోధ్య కలెక్టర్‌(ఎక్స్‌ అఫిషియో సభ్యుడు), రామాలయ నిర్మాణ ప్రాంగణ వ్యవహారాలు చూసే పాలక మండలి చైర్మన్‌ (ఎక్స్‌ అఫిషియో సభ్యుడు)లు నామినేటెడ్‌ సభ్యులుగా ఉంటారు.

రామాలయ ట్రస్ట్‌ కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలోని పరాశరన్‌ ఇంటిలో ఏర్పాటు చేయనున్నారు. కాగా, రామాలయ నిర్మాణం తాము రూపొందిచిన ఆకృతి ప్రకారమే సాగుతుందని నమ్ముతున్నట్లు విశ్వ హిందూ పరిషత్‌ పేర్కొంది. తాము మూడు దశాబ్ధాలుగా అయోధ్యలో రాతి చెక్కడాలు, శిల్పాలు, స్తంభాలు చెక్కిస్తున్నామని తెలిపింది.

దాదాపు 30 ఏళ్లుగా అయోధ్యలో రామమందిర నిర్మాణ వ్యవహారం నలుగుతోంది. రామ మందిర నిర్మాణం కోసం 1990లో బీజేపీ నేత ఎల్‌కే అధ్వాని రథయాత్ర చేశారు. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్త పరిణామాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి అయోధ్య వివాదం నలుగుతోంది. ప్రతి ఎన్నికల మెనిఫెస్టోలోనూ బీజేపీ రామ మందిర నిర్మాణం గురించి పేర్కొంటోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇప్పటికి ఈ వ్యవహారం శాంతియుతంగా ఓ కొలిక్కి రావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి