iDreamPost

మర్కజ్‌ – విదేశీ తబ్లిగీలపై కేంద్రం సంచలన నిర్ణయం

మర్కజ్‌ – విదేశీ తబ్లిగీలపై కేంద్రం సంచలన నిర్ణయం

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో గత మార్చి 13-17 మధ్యలో జరిగిన జమాతే మర్కజ్‌ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల నుంచి తబ్లిగీలు పాల్గొన్నారు. వీరితో పాటు భారత్‌కు పర్యాటక వీసాపై వచ్చిన కొంత మంది విదేశీ తబ్లిగీలు నిబంధనలకు విరుద్ధంగా జమాతే మర్కజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఢిల్లీ పోలీసుల విచారణలో వీసా నిబంధనల ఉల్లంఘన వెలుగు చూడటంతో ఢిల్లీ హైకోర్టుకు కూడా ఈ విషయం గురించి తెలియజేశారు.ప్రభుత్వ అనుమతి లేకుండా నిబంధనలను ఉల్లంఘించి మతపరమైన సమావేశంలో పాల్గొన్నందుకు దాదాపు 2550 మంది విదేశీయులను కేంద్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది.

తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన 2550మంది తబ్లిగీలను 10ఏళ్ల పాటు భారత్‌లో ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.జమాతే మర్కజ్‌ కార్యక్రమం ముగిసిన అనంతరం థాయ్‌లాండ్, సింగపూర్, ఇండొనేషియా తదితర దేశాలకు చెందిన తబ్లిగీలు దేశంలోని పలు రాష్ట్రాలకు అక్రమంగా వెళ్లారు.దేశంలో నామమాత్రంగా ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరగటంపై దర్యాప్తు చేపట్టిన కేంద్రం మర్కజ్‌ సదస్సు అందుకు ప్రధాన కారణమని మార్చి చివర గుర్తించింది.

తబ్లిగీ జమాత్‌‌ వల్ల కరోనా వైరస్‌ అన్ని రాష్ట్రాలకు వ్యాపించిందని కేంద్రం,కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపించాయి. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా సదస్సు జరిగిన భవనంలోనే వేలాది మంది తబ్లిగీలు ఉండిపోయారు. దీంతో కార్యక్రమం జరిగిన మర్కజ్ భవనం నుంచి అధికారులు వేలాది మంది తబ్లీగీలను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు.

లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా మర్కజ్ భవనంలోనే వేలాది మంది తబ్లిగీలకు ఆశ్రమం కల్పించడానే కారణంతో తబ్లిగీ చీఫ్‌ మౌలానా సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.దీంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు జమ అయినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది.ఈ నేపథ్యంలో మౌలానాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీ ల్యాండరింగ్‌ కేసు కూడా నమోదు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి