iDreamPost

మిస్ఫైర్ అయిన మెగా కాంబో – Nostalgia

మిస్ఫైర్ అయిన మెగా కాంబో – Nostalgia

కొన్ని సినిమా కాంబినేషన్లు చాలా అరుదుగా అద్భుతంగా అనిపిస్తాయి. ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేపుతాయి. అందులోనూ పేరున్న దర్శకుడు దానికి తోడైతే ఇక ఆకాశం హద్దు అనే మాట కూడా చిన్నదే. 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి ఫస్ట్ టైం కాంబోలో మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మొదటిసారి దీన్ని అనౌన్స్ చేసినప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎందుకంటే అప్పటిదాకా ఆ కలయిక సాధ్యపడనే లేదు. దానికి తోడు ఆ టైంలో భీభత్సమైన ఫామ్ లో ఉన్న రాజ్ కోటి సంగీతం తోడవ్వడంతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కావడం ఖాయమనే అనుకున్నారు అందరు.

హీరోయిన్ గా విజయశాంతిని తీసుకున్నారు. అప్పటికే 18 సినిమాల్లో తను చిరుకి జోడిగా నటించింది. దాదాపు అన్ని హిట్లే. సత్యనారాయణ, శారదా, సుధాకర్, బ్రహ్మానందం లాంటి సీనియర్లతో చాలా రిచ్ క్యాస్టింగ్. ఇక బడ్జెట్ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి మెకానిక్ అల్లుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తీరా విడుదలయ్యాక అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి కానీ అవి బ్లాక్ బస్టర్ కి దారి తీయలేకపోయాయి. విపరీతమైన అంచనాల్లో సగం కూడా అందుకోలేక మెకానిక్ అల్లుడు ట్రాక్ తప్పాడు. మ్యూజికల్ గా అప్పటికే మారుమ్రోగిపోయిన పాటలు ఒక్కటే తెరపై కలర్ ఫుల్ గా కనిపించాయి. ఇక మిగిలిన అంశాల్లో ఏమంత మెప్పించలేకపోయింది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో నడిచే నీరసమైన కథనం, అవుట్ డేటెడ్ ఫార్ములా ప్రేక్షకులను నిరాశకు గురిచేశాయి. గురువా గురువా అనే పాటలో అక్కినేని, మెగాస్టార్ హుషారుగా వేసిన స్టెప్పులు మాత్రం ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. అది మినహాయిస్తే స్టోరీ పరంగా ఎలాంటి మెరుపులు లేకపోవడంతో మెకానిక్ అల్లుడు కాంబినేషన్ పరంగా తెచ్చుకున్న హైప్ ని నిలబెట్టుకోలేకపోయింది. ఆ తర్వాత చిరు-విజయశాంతిలు కలిసి నటించలేదు. అక్కినేని సైతం ఇంకోసారి చిరంజీవితో చేసేలా ఏ దర్శకుడు కథ రాయలేకపోయాడు. ఫలితంగా అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోయింది. అందుకే మల్టీ స్టారర్లలో ఉండే ఇలాంటి రిస్క్ వల్లే మన దర్శక నిర్మాతలు, హీరోలు అంత సులభంగా వీటిని ఒప్పుకోరు. దీని తర్వాతే వరసగా మూడేళ్ళ పాటు ఒకటి రెండు మినహా తన స్థాయి హిట్టు లేక 1996లో పూర్తిగా గ్యాప్ తీసుకున్నారు చిరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి