iDreamPost

పవన్ కళ్యాణ్ తీరు ఇంతే..!

పవన్ కళ్యాణ్ తీరు ఇంతే..!

రాజకీయ జీవితంలో ఒక్కొక్క ఏడాది వెనక్కి వెళ్లి పోతోంది. అనుభవం వచ్చే కొద్దీ నాయకుడి ప్రతి పనిలో, మాటలో పరిపక్వత కనిపించాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఆది నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది. ఏదైనా ఒక అంశంలో ప్రారంభాన్ని వదిలేసి మధ్యలో వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం మొదటి నుంచి చూస్తున్నాం. ఏదైనా ఒక అంశంపై పూర్వాపరాలు గురించి చర్చించకుండా వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని పవన్ కళ్యాణ్ ఆది నుంచి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ప్రస్తుత సమయంలోనూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ.. పవన్ కళ్యాణ్ వైసీపీ నే టార్గెట్ చేయడం విశేషం.

తాజాగా పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారంలో తల దూర్చారు. రేపిడ్ టెస్ట్ కిట్ల ధరల విషయంపై మొదట టీడీపీ, ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ..వైసీపీ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్నాను విమర్శించారు. ఇదే సమయంలో కర్ణాటక లో ఉన్న బిజెపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా టెస్ట్ వికెట్లను 795 రూపాయలు చొప్పున కొనుగోలు చేశాయి. అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 350 రూపాయలకే టెస్ట్ వికెట్లను కొనుగోలు చేసిందని వైసీపీ ప్రభుత్వం 730 రూపాయలకు కొనుగోలు చేసి మూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని టిడిపి నేతలు, కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశం మొదట టిడిపి ప్రస్తావించగా.. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ టిడిపి వాదననే గుడ్డిగా సమర్థించారు. ఇక్కడే ఎంపీ విజయసాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ..చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నారని, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణకు 20 కోట్ల రూపాయలకు ఇచ్చారని ఆరోపించారు. ఇరువురు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచాయి. ఇది ఇప్పటి వరకు జరిగిన వ్యవహారం.

ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ”ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మరి రాష్ట్రాన్ని సైతం విడిచిపెట్టలేదు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే తప్పులను ఎత్తి చూపుతున్న వారిని టార్గెట్ కార్యక్రమాన్ని అధికార పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. వైద్య సేవలు అందించాల్సిన తరుణంలో రాజకీయాలను భుజాలకు ఎత్తుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాదులు అంతా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కరోనా రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలి పెట్టి పోయేంతవరకు రాజకీయాలను పక్కన పెడదాం. రాజకీయాలకు దూరంగా ఉందాం. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు తీర్చడం పై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరించడం అవసరం. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది..” అని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఇలా హితవు చెప్పడం చాలా బాగుంది. అయితే కేవలం అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అనడం ఇక్కడ పవన్ లక్ష్యాన్ని చెప్పకనే చెబుతోంది. అసలు రరేపిడ్ టెస్ట్ కిట్ల వ్యవహారంలో మొదట అవినీతి ఆరోపణలు చేసింది టిడిపి. ఆ తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అదే పల్లవి ఎత్తుకున్నారు. ఆ తర్వాత తమపై, తమ ప్రభుత్వం పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అధికార పార్టీ నేతలు కూడా టిడిపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తన ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించని పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వం, వైసీపీ నేతల లక్ష్యంగా విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ అపరిపక్వతను తేట తెల్లం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి