iDreamPost

టెస్ట్ క్రికెట్‌ – అత్యల్ప స్కోరుకు 65 వసంతాలు

టెస్ట్ క్రికెట్‌ – అత్యల్ప స్కోరుకు  65 వసంతాలు

1955 మార్చి 25న ఆక్లాండ్ ఈడెన్ గ్రౌండ్‌లో మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ జట్టు తలపడింది.సరిగ్గా ఈ రోజు ఆ టెస్టులో అత్యల్ప ఇన్నింగ్స్ పరుగుల రికార్డు న్యూజిలాండ్ పేరిట నమోదైంది.టెస్ట్ క్రికెట్‌లో నమోదైన కనిష్ట ఇన్నింగ్స్ స్కోరు 26 పరుగుల రికార్డును ఏ జట్టు చెరిపేయలేదు.నేటితో టెస్ట్ అత్యల్ప స్కోరు రికార్డ్ 65 వార్షికోత్సవాలు పూర్తి చేసుకోవడం విశేషం.

అంతేకాక 1896,1924లలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా చేసిన మునుపటి అత్యల్ప స్కోరు 30 పరుగుల కంటే నాలుగు పరుగులు తక్కువగా చేశారు.ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌ల వైఫల్యంతో ఆస్ట్రేలియాపై సాధించిన 1946 నాటి అత్యల్ప టెస్ట్ స్కోరు 42 పరుగుల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.తాజాగా గత ఏడాది లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాట్స్‌మన్‌లు కివీస్ రికార్డును బద్దలు కొట్టే స్థాయి బ్యాటింగ్ ప్రదర్శన చేశారు….కానీ ఇన్నింగ్ చివరకు 38 పరుగులు సాధించడంతో కివీస్ అత్యల్ప పరుగుల రికార్డు బ్రేక్ కాలేదు.

ఆక్లాండ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను ఎంపిక చేసుకుంది.మొదటి ఇన్నింగ్స్‌లో 88.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 200 పరుగులు సాధించింది.అనంతరం పర్యాటక ఇంగ్లీష్ జట్టు 119.1 ఓవర్లలో 246 పరుగులు సాధించింది.మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు వెనకబడిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే సాధించి పది వికెట్లు కోల్పోయింది.

దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు సాధించిన పరమ చెత్త రికార్డును కివీస్ తన పేరున నమోదు చేసుకుంది.ఈ టెస్టులో ఇన్నింగ్స్‌ 20 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.ఇంగ్లాండ్ బౌలర్ అప్లియార్డ్ ఆరు ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి నాలుగు ప్రధాన వికెట్లు పడగొట్టాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి