iDreamPost

రాజధానిలో పేదలకు ఇళ్లు ఉండకూడదా ??

రాజధానిలో పేదలకు ఇళ్లు ఉండకూడదా ??

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఈరోజు వైసిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ నుండి అమరావతి వరకు ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో వైసిపి మహిళా కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పేదప్రజలకు రాజధానిలో సొంత ఇంటి కల నెరవేరే లక్ష్యంతో రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలలోని 57 వేల కుటుంబాలకు లభ్ది చేకూర్చేలా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అందరు స్వాగతించాలన్నారు. అదే సమయంలో ఈనెల 23 న అమరావతి మండలం లేమల్లె గ్రామంలో వైసిపికి చెందిన దళిత ఎంపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై కొందరు టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో గూండాగిరి చేస్తూ పథకం ప్రకారమే దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మహిళలు, వైసిపి కార్యకర్తలు శాంతి ర్యాలీ నిర్వహించారు.

వైసీపి ఆధ్వర్యంలో జరిగిన శాంతి ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి ఓర్చుకోలేకనే చంద్రబాబు అండ్‌ కో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నందిగం సురేష్ లాంటి ప్రజా ప్రతినిధులపైనే ఉద్యమం ముసుగులో తెలుగుదేశం కార్యకర్తలు దాడులు చేస్తే ఇక మా లాంటి దళితులు, సామాన్యుల పరిస్థితి ఏంటని ర్యాలీలో పాల్గొన్న పలు దళిత బహుజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

విజయవాడ నుండి అమరావతికి వైసిపి మహిళ కార్యకర్తలు ర్యాలీగా వెళుతున్న సందర్భంగా ఇదే మార్గంలోని తాళ్లయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల మీదగా యాత్ర కొనసాగుతున్న సమయంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్న ఆందోళనకారులు శిబిరాల ముందు నుండి యాత్ర కొనసాగింది. ఈ సందర్భంలో రాజధాని కోసం నిరసనలు దీక్షలు చేపట్టిన మహిళలు జై అమరావతి.. అంటూ నినాదాలు చెయ్యడంతో, ఇదే సమయంలో రాజధానిలో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా వైసిపి మహిళా కార్యకర్తలు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దింతో ఇరు పక్షాల మధ్య పోటాపోటీ నినాదాలతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మరోవైపు వైసీపీ ర్యాలీ దృష్యా ఇరుపక్షాల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఈ రోజు ఉదయం నుండే మందడం, వెలగపూడిలలో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. కాగా ఇరువర్గాల మధ్య ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా వైసిపి యాత్ర మందడం, వెలగపూడి గ్రామాల మీదగా ముందుకెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి