‘సాయం చేస్తున్న వాడికి గాయం చేసే రోజులివి’. గాయం చేసినంత మాత్రాన అతడు మారుతాడనుకుంటే అది మన పొరపాటే. అలవాటు అయితే మానుకుంటాడేమో కానీ.. అది అతడి గుణమైతే తన మీద ఎన్ని కుట్రలు పన్నినా గానీ ప్రాణం పోయేంతవరకు వదలడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న పని ఇదే. తన కష్టాల్లో తోడుగా ఉన్న అభిమానులను తన సంతోషంలో కూడా భాగం చేశాడీ రౌడీ హీరో. ఇప్పటి వరకు ఏ హీరో చేయని సాహసం చేసి.. 100 కుటుంబాలకు రూ. లక్ష చొప్పున అందించడం నిజంగా అభినందించ దగ్గ విషయం. కానీ ఇంత చేసిన విజయ్ దేవరకొండకు రావాల్సిన పబ్లిసిటి వచ్చిందా? అంటే రాలేదనే చెప్పాలి.
అయితే లేనిపోని విషయాలకు ఫుల్ గా పబ్లిసిటీ ఇచ్చే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఓ వర్గం పనికట్టుకుని విజయ్ పై పగ సాధిస్తుందని విజయ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ బాబు, చిరంజీవి లాంటి మరికొందరు హీరోలు చేసే సహాయాల గురించి ఎంతో కవరేజీలు ఇచ్చే మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలు విజయ్ దేవరకొండ తన కష్టార్జితం అయిన రూ. కోటి రూపాయాలను 100 కుటుంబాలకు అందిస్తే.. కనీస కవరేజీ కూడా ఇవ్వలేదు. అయ్యా ఆకలి.. అన్న వాడికి రూపాయి దానం చేయడానికే ఒకటికి రెండు సార్లు ఆలోచించే ఈ రోజుల్లో.. కోటి రూపాయాలు ఇవ్వడం అంటే మాటలా? విజయ్ నిస్వార్థంగా అందించిన ఈ లక్ష రూపాయలు ఓ విద్యార్థి చదువుకు, అనారోగ్యంతో ఉన్న ఓ తల్లి వైద్యానికి కూడా ఉపయోగపడొచ్చు. ఇంత చేసినా.. విజయ్ గురించి న్యూస్ లో వచ్చింది మాత్రం తక్కువనే చెప్పాలి.
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ను ఓ వర్గం పనికట్టుకుని తొక్కడానికి ప్రయత్నిస్తోందని విజయ్ తండ్రే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న విజయ్ కి ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువైయ్యారని ఫ్యాన్స్ కూడా ఆరోపిస్తున్నారు. కాగా.. లైగర్ డిజాస్టర్ తో డీలా పడ్డ విజయ్ కు ఖుషి విజయాన్ని అందించింది. ఈ విజయంలో భాగమైన తన అభిమానుల రుణం తీర్చుకునేందుకు.. 100 కుటుంబాలకు చేయూతనిచ్చాడు విజయ్. ఈ ట్రెండ్ ను ఇక ముందు కూడా కొనసాగిస్తానని విజయ్ చెప్పుకొచ్చాడు. రామాయణంలో రాముడికి ఉడుత చేసిన సాయానికి గుర్తుగా రాముడు దానిపై గీతలు వదిలితే.. ఇప్పుడు విజయ్ చేసిన సాయానికి గుర్తుగా అతడిని తొక్కాలని చూస్తున్నారు. విజయ్ పై కుట్రలో భాగంగానే అతడు చేసిన సాయానికి ఇసుమంతైనా పబ్లిసిటీ రాకుండా చూసుకుంది ఈ బ్యాచ్.
కాగా.. విజయ్ సాయం ఇదొక్కటే కాదు. ప్రతి సంవత్సరం ఎంతో మందికి తనకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాడు. ప్రత్యేకించి క్రిస్మస్ పండుగకు దేవర శాంట గిఫ్ట్స్ పేరుమీద ధన సాయం, వస్తు సాయాలు చేస్తూ ఉన్నప్పటికీ.. వాటి గురించి చెప్పుకోలేదు రౌడీ హీరో. చేసే సాయమే కనిపించాలి గానీ.. దాని వెనకు ఉన్న చేతులు కాదు అని నమ్మే వ్యక్తి విజయ్ దేవరకొండ. అలాంటి మంచి మనసున్న వ్యక్తిపై ఇంత కుట్ర దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు సగటు సినీ అభిమానులు. మరి విజయ్ దేవరకొండపై జరుగుతున్న కుట్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.