ప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు శైలి కాస్త వైవిధ్యమనే చెప్పాలి. కామెడీ మూవీస్‌కు ఆయన పెద్దపీట వేస్తుంటారు. మిగతా హీరోల్లా కాకుండా ఆయన తనదైన రూట్లో ప్రయాణిస్తున్నారు. కథకు అధిక ప్రాధాన్యమిచ్చే శ్రీవిష్ణు.. అవసరమైతే తన పాత్ర పరిధి తక్కువున్నా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. మంచి స్టోరీస్‌ను ఆడియెన్స్‌ను చెప్పాలనే తాపత్రయం ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీవిష్ణు నటించిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అలాంటి ఈ యంగ్ హీరోకు ఈమధ్య టైమ్ కలసిరాలేదు. ‘బ్రోచేవారెవరురా’ లాంటి సాలిడ్ హిట్‌తో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు శ్రీవిష్ణు. కానీ ఆ తర్వాత యాక్ట్ చేసిన మూవీస్ మాత్రం పెద్దగా ఆడలేదు.
మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజైన ‘రాజ రాజ చోర’ యావరేజీగా నిలిచింది. కానీ ఆ తర్వాత చేసిన ‘అర్జున ఫాల్గుణ’, ‘భలా తందనాన’, ‘అల్లూరి’ చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. యాక్షన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన ‘అల్లూరి’ రిజల్ట్ శ్రీవిష్ణును దారుణంగా నిరాశపర్చింది. దీంతో ఆయనకు ఒక హిట్ తప్పనిసరిగా మారింది. కసి మీదున్న శ్రీవిష్ణు ‘సామజవరగమన’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 12 రోజుల్లోనే రూ.40 కోట్లకు పైగా గ్రాస్‌తో డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ హీరో కెరీర్లో మెమరబుల్ హిట్‌గా గుర్తుండిపోయింది. ‘సామజవరగమన’ థియేటర్లలో ఇంకా హిట్ రన్‌ను కొనసాగిస్తోంది. ఈ విజయం ఇచ్చిన జోష్‌లో ఉన్న శ్రీవిష్ణు తన తర్వాతి ప్రాజెక్టుపై ఫోకస్ పెడుతున్నారు.
ఈసారి ప్రీక్వెల్ మూవీకి శ్రీవిష్ణు ప్లాన్ చేస్తున్నారట. తాను గతంలో నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం ప్రీక్వెల్‌కు ఈ హీరో ఓకే చెప్పారని సమాచారం. ఈ ప్రీక్వెల్ చిత్రానికి ‘స్వాగ్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని టాక్. ఈ ఫిల్మ్‌ను త్వరలో పట్టాలెక్కించాలని అనుకుంటున్నారట. షూటింగ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే యావరేజీగా నిలిచిన ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెల్ అవసరమా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ లేని ఆ సినిమాకు ప్రీక్వెల్ చేయడం అంటే సాహసమేనని నెటిజన్స్ అంటున్నారు. ‘సామజవరగమన’ హిట్‌తో మంచి ఊపు మీదున్న శ్రీవిష్ణు ఏం చేస్తారో చూడాలి. మరి.. ‘రాజ రాజ చోర’ ప్రీక్వెల్ తెరకెక్కాలని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.