Tirupathi Rao
Tirupathi Rao
మంచు మోహన్ బాబు.. తెలుగు చలనచిత్ర రంగంలో పరిచయం అవసరం లేని పేరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా, నిర్మాతగా, విద్యా సంస్థల అధినేతగా ఆయన ఎదిగిన తీరు కచ్చితంగా ఆదర్శనీయం. ఇలా కష్టాన్ని నమ్ముకుని ముందుకి వెళ్లే మోహాన్ బాబు సమాజం పట్ల లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. కలెక్షన్ కింగ్ చేసే కొన్ని కామెంట్స్ ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఇక స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మోహన్ బాబు కుల వివక్షపై సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడూ తమ సినిమాల గురించి గొప్పగా చెప్పుకుంటూ వార్తల్లో నిలిచే.. ఈ మంచు శిఖరం ఈసారి ఓ మంచి సందేశాన్ని ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తిరుపతిలోని తన యూనివర్సిటీలో మోహన్ బాబు 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో యూనివర్సిటీ పక్కన ఉండే గ్రామ ప్రజలను కూడా భాగం చేశారు. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన తల్లితండ్రులను, గురువులను, జన్మభూమిని, ఆప్తులను, ఆత్మీయులైన గ్రామస్థులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటానని మోహన్ బాబు ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే మోహన్ బాబు కుల వివక్షపై కూడా సీరియస్ గా మాట్లాడారు. “నా చిన్నతనంలో కూడా కులాలు ఉండేవి. కానీ.., వాటిని పట్టించుకునే వారు కాదు. అత్త, పిన్ని, మావయ్య అంటూ అన్నీ కులాల వారిని వరసలు పెట్టి పిలుచుకునే వాళ్ళం. అందరం కలిసిమెలిసి జీవించే వాళ్ళం. నాతో ఉన్న వారిని ఎవరైనా తక్కువ కులం వారంటే.. అలా అన్న వారిని చెప్పుతో కొడతానన్నాను. కానీ.., ఇప్పుడు సమాజంలో కుల పిచ్చి, కుల వివక్ష ఎక్కువ అయ్యింది. ఇది అందరి నాశనానికి దారి తీస్తుంది. ఇందుకే నాకు కులం అంటే అసహ్యం” అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.