ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఇచ్చే దర్శకుల వెంట పడుతూ ఉంటారు హీరోలు, ప్రొడ్యూసర్లు. ఫ్లాప్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ల వైపు కనీసం కన్నెత్తికూడా చూడరు కొంతమంది హీరోలు. కానీ దీనికి రివర్స్ లో వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో గోపిచంద్. ఇప్పటికే సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు గోపీచంద్. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న శ్రీను వైట్లకు ఛాన్స్ ఇచ్చాడు ఈ మ్యాచో స్టార్. తాజాగా ప్రభాస్ కు డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు గోపీచంద్ రివర్స్ గేర్ లో వెళ్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు.
ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్లకు తమ నెక్ట్స్ మూవీ ఛాన్స్ లు ఇస్తుంటే.. మ్యాచో స్టార్ గోపీచంద్ మాత్రం రివర్స్ గేర్ వేసి.. ఫ్లాప్ మూవీస్ చేసిన డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నాడు. ఇటీవలే స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు గోపీచంద్. ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే శ్రీను వైట్ల నుంచి సినిమా వచ్చి చాలా సంవత్సరాలే అవుతోంది. గతంలో ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో పాటుగా.. యువ దర్శకులు ఇండస్ట్రీకి రావడంతో.. ఆయన నుంచి ఇంతవరకు సినిమా రాలేదు.
ఇదిలా ఉండగా.. గోపీచంద్ మరోసారి ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీకాక ఈ దర్శకుడు ఇదివరకే గోపీచంద్ తో ఓ సినిమా తీశాడు కూడా. అవును గోపీచంద్-రాశీ ఖన్నా జంటగా నటించిన ‘జిల్’ సినిమాని తెరకెక్కించిన రాధకృష్ణ డైరెక్షన్ లోనే మరో సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే గోపీచంద్ కు చెప్పాడని, అతడికి కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లుగా వినికిడి. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి. రాధేశ్యామ్ తర్వాత రాధాకృష్ణ ఏ మూవీని అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు గోపీచంద్ తో మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి త్వరలోనే అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అందరు హీరోలు ఒక మార్గంలో వెళ్తుంటే.. గోపీచంద్ మాత్రం రివర్స్ గేర్ లో వెళ్తున్నాడని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. మరి గోపీచంద్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.