TG Govt-Rythu Bharosa Money: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.15 వేలు.. ఎప్పుడంటే

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.15 వేలు.. ఎప్పుడంటే

TG Govt-Rythu Bharosa Money: రైతులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. వారి ఖాతాలో ఏకంగా 15 వేలు వేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

TG Govt-Rythu Bharosa Money: రైతులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. వారి ఖాతాలో ఏకంగా 15 వేలు వేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కార్‌.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తూ.. ముందుకు సాగుతోంది. వీటితో పాటు.. ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో చాలా వరకు అమలు చేసిన రేవంత్‌ సర్కార్‌.. ఇప్పుడు రుణమాఫీపై దృష్టి పెట్టింది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణ మాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌.. ఇప్పటికే రెండు విడతల్లో.. రూ.లక్ష, లక్షన్నర వరకు మాఫీ చేసింది. ఆగస్టు 15 నాటికి మూడో విడత కూడా పూర్తి చేస్తామన్నది. ఇది పూర్తైన తర్వాత మిగిలి ఉన్న ప్రధాన హామీ.. రైతు భరోసా. దీనిపై తాజాగా ఆసక్తికర వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.

రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఇదే పథకం కింద ఎకరాకు రూ.10 వేల రూపాయలు రెండు దఫాల్లో ఇచ్చేది. ఆమొత్తాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ 15 వేలకు పెంచింది. అంతేకాక కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నది. ఇకపోతే.. నిన్నటివరకూ రైతు భరోసా 2 దశల్లో అమలు చెయ్యాలని అనుకున్నా.. ఇప్పుడు ఒకే దశలో అమలు చేసి, ఒకేసారి రూ.15,000 ఇవ్వాలని భావిస్తోందట ప్రభుత్వం.

ఇందుకు కారణం లేకపోలేదు. అధికారంలోకి రాగానే అనగా గతేడాది డిసెంబర్‌లోనే కాంగ్రెస్‌ సర్కార్‌.. రైతు భరోసాని అమలు చెయ్యాల్సి ఉంది. కానీ నిధుల సమస్య కారణంగా రైతు బంధునే అమలు చేసింది. దీనిపై కొంత మేర అసంతృప్తి ఉంది. దాంతో ఈసారి రైతు భరోసా పథకాన్ని గ్రాండ్‌గా ప్రారంభించి, పక్కా లెక్కలతో లబ్దిదారులైన ప్రతీ రైతుకూ పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఐతే.. ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయే పరిస్థితి వస్తోంది కాబట్టి.. మొత్తం రూ.15,000 ఒకేసారి ఇస్తే.. మంచిదని సర్కార్‌ భావిస్తోందట.

అంతేకాక రైతులతోపాటూ.. కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి రూ.15,000 ఇవ్వాల్సి ఉంది. అలాగే రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి రూ.12,000 ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ పథకాల అమలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి. అయితే ఆగస్టు 15 తర్వాత రైతు భరోసా నిధులు ఉండవచ్చనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఏది ఏమైనా దీని మీద అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూపులు తప్పవు.

Show comments