ఈ నెల 20 వరకు వర్షాలు.. మరోసారి భాగ్యనగరికి అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ప్రజలు. హైదరాబాద్ నగరం నీట మునిగింది. జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కాగా మరోసారి భాగ్య నగరిని వానలు ముంచెత్తనున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ప్రజలు. హైదరాబాద్ నగరం నీట మునిగింది. జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కాగా మరోసారి భాగ్య నగరిని వానలు ముంచెత్తనున్నాయి.

అటు ఎండలు, ఇటు వానలతో తడిసి ముద్దవుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఇలాంటి వాతావరణాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన జనాలు.. వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందినట్లు అయ్యింది. అయితే భారీగా వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. కుండకు చిల్లులు పడ్డట్టు వాన పడుతూనే ఉంది. రోడ్లన్నీ నీట మునిగాయి. గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో రాక పోకల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రకమైన వాతావరణ మార్పులకు ఇమడలేకపోతున్నారు జనాలు. ఇక హైదరాబాద్ మహా నగరంలో కాసేపు ఎండ, మరికాసేపు వానలు పడుతున్నాయి. కొంత వర్షానికి మోకాళ్ల లోతు నీరు రోడ్లపైకి చేరుతుంది. దీంతో ప్రయాణీకులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే.. మరోసారి భాగ్యనగరిని వానలు ముంచెత్తనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 20 వరకు వానలు పడతాయని హెచ్చరించింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం.. గురువారం మధ్యప్రదేశ్‌కు నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

భాగ్య నగరిలో పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాలు ఓ మోస్తరు వానలకు అవకాశాలున్నాయని తెలిపింది. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లోకి, బహిరంగ ప్రాంతాల్లో ఉండవద్దని హెచ్చరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నల్గొండ జిల్లా కనగల్‌లో అత్యధికంగా 10.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. అలాగే హైదరాబాద్ నడి బొడ్డు ప్రాంతమైన ఖైరతాబాద్‌లో 9 సెం.మీ వర్షపాతం రికార్డు అయ్యింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడటంతో రైతులు పంట నష్టాన్ని చవి చూశాడు. పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. రైతులకు ఈ వాన కడగండ్లు మిగిల్చింది. అలాగే పిడుగు పాటుకు సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతి చెందారు.

Show comments