తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గవర్నర్గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ నాలుగేళ్లు గవర్నర్గా తన మీద రాష్ట్ర ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానానికి తమిళిసై కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలతో పాటు సీఎం కేసీఆర్పై ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎక్కడ ఉన్నప్పటికీ తెలంగాణతో బంధాన్ని మాత్రం మర్చిపోనన్నారామె. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నాయకుడని.. ఆయన ఒక పవర్ఫుల్ లీడర్ అంటూ గవర్నర్ కొనియాడారు.
నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను తాను చూస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఆయనతో తనకు ఎలాంటి దూరం లేదని.. అసలు దాని గురించి తాను పట్టించుకోనన్నారామె. తన దారి తనదే అంటూ ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు తమిళిసై. సవాళ్లు, పంతాలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తన బాధ్యతలు, విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ.. గవర్నర్గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నానని తమిళిసై పేర్కొన్నారు. తాను తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రజలకు సేవ చేయడానికే రాష్ట్రానికి వచ్చాను తప్ప.. రాజకీయాలు చేయడానికి కాదన్నారు తమిళిసై. సర్కారుతో వివాదాలు పెట్టుకునే ఉద్దేశం, కొట్లాడాలనే ఆలోచన గానీ తనకు లేవని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు చాలా సేవ చేయాలని ఉందని.. అయితే గవర్నర్ ఆఫీస్కు పరిమితులు ఉంటాయన్నారు. ప్రజా సేవ తప్పితే.. తనకు ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదని తమిళిసై తెలిపారు. తనది మోసం చేసే మనస్తత్వం కాదన్నారామె. పీపుల్ ఫ్రెండ్లీ గవర్నర్గా ఉండాలన్నదే తన అభిమతమని తమిళిసై వివరించారు. పుదుచ్చేరికి కూడా తాను గవర్నర్గా ఉన్నానని.. కానీ తెలంగాణ ప్రజల కోసమే ఎక్కువ టైమ్ వెచ్చిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: ప్రాణాలు తీసుకునే పరిస్థితి నుంచి.. డాక్టర్ స్థాయికి!