Dharani
మత్తు పదార్థాల వినియోగానికి చెక్ పెట్టడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల నిమిషాల్లోనే డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించవచ్చు. ఆ వివరాలు..
మత్తు పదార్థాల వినియోగానికి చెక్ పెట్టడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల నిమిషాల్లోనే డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించవచ్చు. ఆ వివరాలు..
Dharani
మన సమాజంలో నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యపానం, మాదకద్రవ్యాలు. వీటి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుంటే.. మరెన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇక మద్యం, డ్రగ్స్ మత్తులో.. విచక్షణ మర్చిపోయి ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నారు. వీటిని నివారించడం కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా.. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతుంది. ప్రస్తుతం డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండటం లేదు. పబ్బులు, హోటల్స్.. ఆఖరికి పాఠశాలలు కూడా డ్రగ్స్‌కి అడ్డగా మారుతున్నాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. డ్రగ్స్ కట్టడికి కట్టుబడి ఉంటామని తెలిపారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు కూడా డ్రగ్స్ నివారణ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు.
సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా.. డ్రగ్స్ వినియోగించే వారితో చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు అనుమానం వచ్చినా సరే.. అదుపులోకి తీసుకుని శాంపిల్స్ కలెక్ట్ చేసి వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. డ్రగ్స్ దొరికితే మాత్రం.. వారికి చుక్కలు చూపిస్తూ.. మూలాల దగ్గరి నుంచి నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పోలీసులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే డ్రగ్స్ టెస్ట్ నిర్వహించి.. నిమిషాల్లోనే వారిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం అయితే.. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం వచ్చినా.. స్పాట్‌లో దొరికినా సరే.. వారు డ్రగ్స్ తీసుకున్నారు అని వెంటనే చెప్పడానికి లేకుండా పోతుంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్నట్లు ఎవరి మీదైనా అనుమానం వస్తే.. ముందుగా వారి వద్ద నుంచి.. శాంపిల్స్ తీసుకుని, ల్యాబ్‌కు పంపించి, వాటి రిజల్ట్ వచ్చిన తర్వాత గానీ అసలు విషయం తేలడం లేదు. దాంతో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తూ.. శాంపిల్స్ ఇచ్చేందుకు టైం తీసుకుంటున్నారు. తాము అందుబాటులో లేమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త టెక్నాలజీని రంగంలోకి దించుతున్నారు.
ఇకపై డ్రగ్స్ తీసుకున్న వారిని క్షణాల్లోనే గుర్తించేలా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కొత్త పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. డ్రగ్స్ టెస్టులకు సంబంధించి కొత్త కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ కిట్స్‌తో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడా.. లేదా.. అనేది నిర్ధారించవచ్చని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కిట్స్ ద్వారా యూరిన్ శాంపిల్ లేకుండానే సదరు వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడా.. లేదా.. అనేది నిమిషాల వ్యవధిలోనే తెలిసిపోతుందని అంటున్నారు.
తాము ఉపయోగించబోయే కిట్స్ సాంకేతికంగా రుజువయ్యాయని.. దీనికి సంబంధించి టెస్ట్ రిజల్ట్స్‌ను న్యాయస్థానాలు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. పబ్బుల్లో, ప్రైవేట్ పార్టీల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఈ కిట్స్ ద్వారా వారిని క్షణాల్లోనే పట్టుకోవచ్చని వెల్లడించారు. అంటే ఇకపై.. అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లాగానే.. డ్రగ్స్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారన్న మాట. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న వారికి ఇక చుక్కలే అంటున్నారు.