Dharani
గతంలో బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో కొత్త జిల్లాల సంఖ్యను పెంచింది. అయతే తాజాగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తగ్గించనుందా అంటే..
గతంలో బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో కొత్త జిల్లాల సంఖ్యను పెంచింది. అయతే తాజాగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తగ్గించనుందా అంటే..
Dharani
9 జిల్లాలతో తెలంగాణ కొత్త రాష్ట్రంగా 2014, జూన్ 2 న ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన నాటి టీఆర్ఎస్ సర్కార్.. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. 9 డిస్ట్రిక్ట్ లను కాస్త.. 33 కు పెంచింది. జిల్లాలతో పాటుగా కొత్తగా రెవెన్యూ మండలాలు, డివిజన్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. అయితే త్వరలోనే తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. అందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తెలంగాణలో జిల్లాల సంఖ్యను తగ్గించనున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు.
సరిగ్గా నెల రోజుల క్రితం అనగా 2023, డిసెంబర్ 7న తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు రేవంత్. దీనిలో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. ప్రస్తుతం అవి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణలో జిల్లాల విభజన సరిగా జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “జిల్లా విభజననపై సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఓ కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయంగా అధ్యయనం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చిస్తాంరు. జిల్లాలే కాకుండా రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఏర్పాటు చేసింది. అధికారులు కూడా గందరగోళంలో ఉన్నారు. అందుకే కమిషన్ ఏర్పాటు చేసి, ఆ రిపోర్టు వచ్చాక ప్రజాభిప్రాయాన్ని కోరతాం. కొత్త జిల్లాలపై అసెంబ్లీలోనూ చర్చిస్తాం” అని తెలిపారు.
“ప్రస్తుతం తెలంగాణ ప్రజలు.. కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో కలుపుకుని ఉన్న 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉంది. దీని వల్ల అటు జడ్పీటీసీలు, ఇటు ఎంపీలు సైతం.. ఏవైనా అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడదాం అంటే.. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో చర్చించాల్సి వస్తుంది. అందుకే త్వరలోనే కొత్త జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తాం. దీనికోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తాం. ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకొంటాం” అన్నారు రేవంత్ రెడ్డి. దాంతో తెలంగాణలో జిల్లాల సంఖ్యను తగ్గిస్తాంరటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో భవిష్యత్తులో తేలనుంది.