హైదరాబాద్‌లో చిరుత సంచారం.. రంగంలోకి దిగిన అటవీ అధికారులు!

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో చిరుతపులి సంచారంతో కలకలం చెలరేగింది. ఎల్‌బీ నగర్‌లోని ఓ వీధిలో చిరుతపులి తిరుగుతోందని తెలుసుకున్న జనం భయం గుప్పిట్లో గిలగిల్లాడుతున్నారు. బయటకు రావటానికి కూడా భయపడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుతపులిని గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఇంతకీ చిరుతపులి విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. ఎల్‌బీ నగర్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌లోని సాగర్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న అకిల్‌ అనే కుర్రాడు రాత్రి భోజనం తర్వాత ఇంటి ముందు సైకిల్‌ నడుపుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడికి వీధిలో చిరుతపులి తిరుగుతూ కనిపించింది.

దీంతో ఒక్కసారిగా అతడి గుండె ఆగినంతపనైంది. సైకిల్‌ను అక్కడే పడేసి.. ఇంట్లోకి పరిగెత్తాడు. చిరుతపులిని చూసిన సంగతి తల్లిదండ్రులకు చెప్పాడు. తర్వాత ఇంటి తలుపులు మూసేశాడు. కుటుంసభ్యులు చిరుత గురించిన సమాచారాన్ని అటవీ అధికారులకు ఇచ్చారు. అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత కోసం ఎంత వెతికినా అది వారికి కనిపించలేదు. చిరుత వేరే ప్రాంతానికి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. తమ ప్రాంతంలో చిరుత తిరుగుతోందని తెలుసుకున్న జనం కంటి మీద కునుకులేకుండా ఉన్నారు.

కాగా, కొన్నేళ్ల క్రితం ఎల్బీ నగర్ ప్రాంతంలో చిరుత నివాసం ఉండేదని అటవీ అధికారులు తెలిపారు. అది ఆటోనగర్లోని డంప్ యార్డులో కుక్కలను వేటాడిందని వారు వెల్లడించారు. చివరకు దాన్ని పట్టుకుని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విడిచిపెట్టినట్టు పేర్కొన్నారు. స్థానికులు భయపడుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల బృందం మరోసారి ఆ ప్రాంతాన్ని సందర్శించనుందని సమాచారం. మరి, హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో చిరుతపులి కలకలం రేపటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments