హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలు రోజుల్లోనే కాదు పండుగ వేళల్లోనూ సిటీలో వాహనాల రద్దీ అధికంగానే ఉంటుంది. అందుకే పర్వదినాలు, పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధిస్తుంటారు. రోడ్డు విస్తరణ, మెట్రో, నాలా పనులు ఉన్న టైమ్‌లో కూడా రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు పెడుతుంటారు. ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తారు. ఇక, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు, అంబర్పేట్ బోనాల నేపథ్యంలో సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
బోనాల సందర్భంగా జులై 16 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రేపటి నుంచి మూడ్రోజుల పాటు చార్మినార్, ఫలక్‌నుమా, నయాపూల్ వైపు ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను అనుమతించరు. అలాగే ఓల్డ్ సీబీఎస్, అఫ్జల్‌గంజ్, దార్-ఉల్-షిపా క్రాస్ రోడ్ ఛత్రినాక, ఇజన్ బలి దగ్గర వెహికిల్స్‌ను నిలిపివేసి దారి మళ్లించనున్నారు. ఉప్పల్ నుంచి అంబర్పేట్ వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను హబ్సిగూడ, తార్నాక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్ మీదుగా ఉప్పల్ క్రాస్ రోడ్‌కు మళ్లిస్తారు. కోఠి నుంచి ఉప్పల్ వైపు వెళ్లే బస్సులను ఫీవర్ హాస్పిటల్, తార్నాక, హబ్సిగూడ మీదుగా ఉప్పల్ క్రాస్ రోడ్‌కు మళ్లింపు చేయనున్నారు.
పండుగ నేపథ్యంలో గౌలిగూడ, సిద్దియాంబర్ బజార్, అఫ్జల్గంజ్తో పాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, శివాజీ బ్రిడ్జ్, మదీనా ‘ఎక్స్’ రోడ్, చార్మినార్ బస్ టెర్మినల్, హిమ్మత్‌పురా, నాగుల్చింత, అలియాబాద్ రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఈ ప్రాంతాల వైపు ప్రయాణించొద్దని, ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. కాగా, బోనాలకు వచ్చే భక్తులకు దేవీ ఫ్లైవుడ్, శాలిబండ, అల్కా థియేటర్‌తో పాటు ఆర్య వైశ్య మందిర్, సాధా థియేటర్ లేన్, వీడీపీ స్కూల్ గ్రౌండ్, మిత్ర స్పోర్ట్స్ క్లబ్, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, లక్ష్మీ నగర్ సరస్వతి విద్యానికేతన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, చార్మినార్ బస్ టెర్మినల్స్‌లో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.