హైదారాబాద్‌: అపార్ట్‌మెంట్‌ మీద పడిన పిడుగు.. భయంతో పరుగులు తీసిన జనాలు!

గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా.. మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వర్షాకాలంలో జోరు వానలు ఎంత సర్వ సాధారణమో.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా అంతే. అయితే అవన్ని జనావాసాల దగ్గర చోటు చేసుకుంటే.. తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తాజాగా ఇలాంటి సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్‌ మీద పిడుగు పడింది. ఫలితంగా గోడలు ధ్వంసమవ్వడమే కాక.. లైట్లు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. ఈ సంఘటన అత్తాపూర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

భారీ వర్షం కారణంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబద్‌లోని అత్తాపూర్‌, వాసుదేవ్‌ నగర్‌లోని హంసరాజ్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ మీద పిడుగు పడింది. పిడుగు ధాటికి భవనంలో ఉన్న లైట్లు, ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్స్‌, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. అపార్ట్‌మెంట్‌ గోడ కొద్దిగా ధ్వంసం అయ్యింది. ఇక ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 40 కుటుంబాలు నివసిస్తున్నాయి అని తెలుస్తోంది. అర్థరాత్రి సమయలో ఒక్కసారిగా భారీ శబ్ధం రావడం, టీవీలు, ఫ్యాన్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు సడెన్‌గా కాలి పోవడంతో.. అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారు ఒక్కక్షణం కంగారు పడ్డారు. భూకంపం వచ్చిందేమో అనుకుని.. భయంతో బయటకు పరుగులు తీశారు.

ఆ తర్వాత పిడుగు పాటు వల్ల ఈ ప్రమాదం సంభవించిందని అర్థం చేసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కొన్ని ప్లాట్స్‌లో విద్యుత్‌ వైరింగ్‌ పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇక రాత్రంతా కరెంట్‌ లేకపోవడం వల్ల.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అపార్ట్‌మెంట్‌ వాసులు చెప్పుకొచ్చారు. పిడుగు పడే సమయంలో ఒక్క వ్యక్తి అక్కడే రోడ్డు మీద ఉన్నాడు. కానీ అదృష్టం కొద్ది అతడికి ఏం కాలేదు. పిడుగుపాటుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో.. ఈ వీడియో తగ వైరలవుతోంది.

Show comments