Hyderabad Metro Fined By Consumer Commission: HYD మెట్రోకు రూ.10 వేల జరిమానా! 4 ఏళ్లు పోరాడిన సామాన్యుడు!

HYD మెట్రోకు రూ.10 వేల జరిమానా! 4 ఏళ్లు పోరాడిన సామాన్యుడు!

  • Author singhj Published - 12:40 PM, Thu - 28 September 23
  • Author singhj Published - 12:40 PM, Thu - 28 September 23
HYD మెట్రోకు రూ.10 వేల జరిమానా! 4 ఏళ్లు పోరాడిన సామాన్యుడు!

తెలంగాణ రాజధాని హైదరాబాద్​ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సాఫ్ట్​వేర్ రంగంలో బెంగళూరు, చెన్నై లాంటి సిటీలకు గట్టిపోటీనిస్తోంది భాగ్యనగరం. అలాంటి హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా మెట్రోను చెప్పుకోవచ్చు. రోజూ వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా, వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. మెట్రోకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ సర్వీసులను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం వేలాది నుంచి లక్షలాది మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోకు ఊహించని విధంగా జరిమానా పడింది.

ఒక ప్రయాణికుడ్ని ఇబ్బంది పెడుతూ.. అతడి మెట్రో కార్డు నుంచి రూ.10 కట్ చేసినందుకు గానూ హైదరాబాద్ మెట్రోకు ఫైన్ పడింది. అయితే ఈ ఘటన జరిగి నాలుగేళ్లు అయింది. కానీ ఈ కేసులో తీర్పు తాజాగా వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ అనే వ్యక్తి 2019, జనవరి 10న హైదరాబాద్​కు వెళ్లాడు. ఎల్​బీ నగర్ మెట్రో రైల్వే స్టేషన్​లోకి ప్రవేశించాక ఈస్ట్ సైడ్ టాయ్​లెట్స్ లేక మరోవైపు వెళ్లాడు. దీంతో మెట్రో అధికారులు జారీ చేసిన కార్డు నుంచి మరోమారు స్వైప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పాత మార్గానికి వచ్చేందుకు ఇంకోసారి స్వైప్ చేశాడు. దీంతో అతడి కార్డు నుంచి హైదరాబాద్ మెట్రో రూ.10 మినహాయించుకుంది.

తాను రైలు ఎక్కాల్సిన రూట్​లో టాయ్​లెట్స్ లేకపోవడంతో వెళ్లినందున అదనంగా డబ్బులు తీసుకున్నారని.. రోజూ వేలాది మంది ప్యాసింజర్లకు ఇలాగే జరుగుతోందని నరేంద్ర ఖమ్మం జిల్లా కన్​జ్యూమర్ కమిషన్​లో కంప్లయింట్ చేశాడు. దీంతో ఈ కేసును పరిశీలించిన వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ వి.లలిత, మెంబర్ ఎ.మాధవీలత బుధవారం తీర్పు ఇచ్చారు. నరేంద్ర నుంచి వసూలు చేసిన రూ.10 తిరిగిచ్చేయడమే గాకుండా అసౌకర్యానికి రూ.5 వేలు, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించారు. ఆ పరిహారాన్ని 45 రోజుల్లోగా బాధితుడికి అందించాలని హైదరాబాద్ మెట్రోను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు. టాయ్​లెట్స్ లేని సందర్భంలో ప్రయాణికులకు కనిపించేలా డిస్​ప్లే బోర్డులు పెట్టాలని ఖమ్మం కన్​జ్యూమర్ కమిషన్ సూచించింది.

ఇదీ చదవండి: నేను పెద్ద లీడర్​ని.. చేతులు కట్టుకొని ఓట్లు అడగాలా?: బీజేపీ నేత

Show comments