రోజుకో గంట చదివింది.. ఇప్పుడేకంగా రూ.34 లక్షల జీతం అందుకుంటుంది

Hanamkonda Techie-Job With Rs 34 Lakh: పేదింట్లో జన్మించిన ఓ యువతి.. కష్టపడి చదివి నేడు ఏడాదికి 34 లక్షల రూపాయల వేతనం అందుకునే ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలు..

Hanamkonda Techie-Job With Rs 34 Lakh: పేదింట్లో జన్మించిన ఓ యువతి.. కష్టపడి చదివి నేడు ఏడాదికి 34 లక్షల రూపాయల వేతనం అందుకునే ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలు..

రాకెట్‌ యుగంలో కూడా ఆడపిల్లల మీద వివక్ష కొనసాగడం దురదృష్టం. ఆడపిల్లకు పెద్ద పెద్ద చదువులేందుకు.. ఎలాను పెళ్లి చేసి పరాయి ఇంటికి పంపాల్సిందే కదా.. మళ్లీ చదువు మీద అదనపు ఖర్చు ఎందుకు అని భావించే వారు ఉన్న సమాజంలో.. పేదింట పుట్టిన ఓ ఆడబిడ్డ.. తల్లిదండ్రులు కష్టాన్ని అర్థం చేసుకుంది. పైగా ఇద్దరు ఆడపిల్లలే కావడంతో బంధువులు తమ మాటలతో భయపెట్టేవారు. చిన్నప్పటి నుంచి వాటన్నింటిని చూస్తూ పెరిగిన ఆ యువతి.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకుంది. ఆదిశగా కృషి చేసింది. చివరకు అనుకున్న ఫలితాన్ని సాధించింది. పేదింట మెరిసిన విద్యా కుసుమానికి ఏడాదికి 34 లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగం లభించింది. ఇన్నాళ్లు ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకు అన్న వాళ్లే.. ఇప్పుడు తమ పిల్లలకు ఆమెని ఆదర్శంగా చూపిస్తున్నారు. ఆ యువతి స్ఫూర్తి గాధ మీ కోసం…

హనుమకొండ జిల్లాకు చెందిన యాల్ల కృష్ణవేణి అనే యువతి.. కోచింగ్‌తో పని లేకుండా రోజుకు కేవలం గంట సేపు మాత్రమే చదువుతూ.. కోడింగ్‌పై పట్టు పెంచుకుని.. పేపాల్‌ అనే ప్రతిష్టాత్మక కంపెనీలో ఏడాదికి 34 లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగం సంపాదించింది. కుమార్తె సాధించిన విజయం చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో పొంగిపోతున్నారు. కృష్ణవేణి విషయానికి వస్తే.. ఆమె తండ్రి సదిరెడ్డి ప్రైవేటు చిట్‌ఫండ్‌ కంపెనీలో చిరుద్యోగి. అమ్మ అంజలి గృహిణి. వీరికి కృష్ణవేణితో పాటు మరో కుమార్తె హరిప్రియ కూడా ఉంది. ఇద్దరు ఆడపిల్లలే అని ఆ తల్లిదండ్రులు ఏనాడు బాధపడలేదు. చదివిస్తే.. వారి కాళ్ల మీద వారే నిలబడతారని.. బలంగా నమ్మారు. అందుకు ఎవరెన్ని రకాలుగా భయపెట్టిన, విమర్శించినా.. పిల్లల చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు.

తల్లిదండ్రులు కష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణవేణి.. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. విద్య మాత్రమే తమ కష్టాలను దూరం చేస్తుందని అర్థం చేసుకున్న కృష్ణవేణి బాగా చదివి ప్రతి సారి క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేది. అలా బీటెక్‌ హనుమకొండ సమీపంలోని ఎస్సార్‌ కాలేజీలో చేరింది. సీఎస్‌ఈ బ్రాంచ్‌ తీసుకుంది. ఉన్నత విద్య కోసం పంపుతుండటంతో.. చాలా మంది ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకు అన్నారు. ఇలా
ఓవైపు బంధువులు, ఇరుగుపొరుగు వారి మాటలు, అటు కాలేజీలో బీటెక్‌ పూర్తయ్యాక కూడా ఉద్యోగాలు దొరకని సీనియర్ల పరిస్థితి చూసి.. మరోవైపు కనీసం ఇంటి అద్దె కట్టడానికి డబ్బుల్లేక తండ్రి పడుతున్న కష్టం ఇవన్ని కృష్ణవేణిలో పట్టుదలను పెంచాయి. ఎలాగైనా సరే.. బీటెక్‌ అయిపోవడంతోనే ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంది.

రోజుకో గంట.. జీవితాన్ని మార్చింది

అయితే అందరిలా కాకుండా.. భిన్నంగా చదివితేనే ఉద్యోగం సంపాదించగలను అని అర్థం చేసుకున్న కృష్ణవేణి.. బీటెక్‌ సబ్జెక్ట్స్‌తో పాటు.. ఇతర నైపుణ్యాలపైన కూడా పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఒక గంట పాటు కోడింగ్‌పై దృష్టి సారించింది. రోజు గంటపాటు క్లాస్‌లు వింటూ అకడమిక్స్‌పై కూడా దృష్టి సారించింది. అలా బీటెక్‌ ఫస్టియర్‌ నుంచి ఫైనల్‌ ఇయర్‌ వరకు కోడింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నైపుణ్యాల్ని నేర్చుకుంది. తాజాగా వచ్చిన చాట్‌జీపీటీలో కూడా తన టాలెంట్‌ చూపించి.. 3 నెలల పాటు పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో పే పాల్‌ కంపెనీలో 34.40 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యింది. అంటే నెలకు సుమారు 2.86 లక్షల జీతం అందుకోబోతుంది అన్నమాట.

ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నెలకు 15 వేల రూపాయల కోసం ఇప్పటికీ కష్టపడుతున్నాడు.. వచ్చే డబ్బునే అమ్మ ఎంతో పొదుపుగా వాడుతుంది. వారి కష్టాన్ని చూస్తూ పెరిగిన నేను.. చదువు వల్ల మా బాధలు తీరతాయని అర్థం చేసుకున్నాను. అందుకే నా ఫ్రెండ్స్‌ సినిమాలు, ఔటింగ్‌ అంటూ తిరిగినా నేను ఎప్పుడు వాటి కోసం టైం వేస్ట్‌ చేయలేదు. ఎట్టకేలకు నా శ్రమ ఫలించింది. ఈ సందర్భంగా నేను చెప్పది ఒక్కటే.. ఎంత కష్టమైనా సరే.. ఇష్టంగా కష్టపడితే మంచి ఫలితం దక్కుతుంది అనడానికి నేనే ఉదాహరణ’’ అని చెప్పుకొచ్చింది.

Show comments