వాహనదారులకు గుడ్ న్యూస్.. సిగ్నల్స్ వద్ద వేచి చూడాల్సిన అవసరం లేదు

తెలుగు రాష్ట్రాల్లో మహా నగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు వేధిస్తుంటాయి. హైదరాబాద్ అంటే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటే భాగ్య నగరం అన్నట్లు తయారయ్యింది. ఉద్యోగులు, ఇతర పనులపై బయటకు వెళ్లే వారు ఈ ట్రాఫిక్‌లో కచ్చితంగా ఇరుక్కోవలసిందే. సిగ్నల్స్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, మెట్రో వంటి సదుపాయాలను ఏర్పాటు చేసినా రణగొణ ధ్వని తగ్గడం లేదు.. కానీ నానాటికి సమస్య రెండింతలు అవుతుంది. దీంతో ఓ కీలక నిర్ణయం తీసుకుంది జీహెచ్ఎంసీ. అందిపుచ్చిన సాంకేతికతతో సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని భావిస్తోంది.

ఈ మేరకు సంబంధిత అధికారులు సమావేశమయ్యారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) జియావుద్దీన్, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమి షనర్ సుధీర్ బాబు, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ముచ్చటించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతటా ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిస్టమ్ కంట్రోల్ (ATSC),పెలికాన్ సిగ్నళ్లు 404 ఉన్నాయి. ఏటీఎస్‌సీలో భాగంగా ప్రస్తుతం మూడు రకాలుగా సిగ్నళ్లు పని చేస్తున్నాయి. ఫిక్స్ మోడ్‌లో భాగంగా ఎన్నిసెకన్ల పాటు సిగ్నల్స్ పనిచేయాలన్నదీ ఒకటైతే, వెహికల్ యాక్టివేటెడ్ కంట్రోల్ (వీఏసీ), మాన్యువల్ మోడల్‌లో సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఒక్కో మోడ్‌ను వినియోగిస్తుంటారు.

అలాగే రోడ్డు దాటే పాదచారుల కోసం పెలికాన్ సిగ్నల్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఫిక్స్ డే మోడ్‌లో నిర్ణీత సమయం ప్రకారం సిగ్నల్స్ డిజైన్ చేసి ఉంటాయి. దీని కారణంగా రద్దీ లేని సమయాల్లో సైతం రెడ్ సిగ్నల్ చూపిస్తుంది. దీంతో గ్రీన్ సిగ్నల్ పడే వరకు వేచి చూడాల్సి వస్తుంది వాహనదారులు. అయితే ఇకపై వీటన్నింటికీ చెక్ పడనుంది. వీఏసీ విధానంపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. ఆయా మార్గంలో వాహనాలు రాకపోతే.. ఆ వైపు ఆటో మెటిక్‌గా రెడ్ సిగ్నల్ పడి.. మరో వైపు గ్రీన్ సిగ్నల్ పడుతుంది. దీంతో సిగ్నల్స్ వద్ద ఎక్కువ సేపు చూడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా పెలికాన్ సిగ్నల్స్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Show comments