Krishna Kowshik
పసికందును తీసుకుని బయటకు వెళ్లాడు తండ్రి. అలా తిప్పికొస్తాడేమో అనుకుంది తల్లి. కానీ అతడు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చాడు. కూతురు ఏదీ అని ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెప్పడం లేదు. చివరకు..
పసికందును తీసుకుని బయటకు వెళ్లాడు తండ్రి. అలా తిప్పికొస్తాడేమో అనుకుంది తల్లి. కానీ అతడు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చాడు. కూతురు ఏదీ అని ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెప్పడం లేదు. చివరకు..
Krishna Kowshik
ఆడపిల్ల అంటే తల్లి కన్నా తండ్రికి ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని సంబరపడిపోతుంటాడు నాన్న. ఆమె పాదాలు కందకుండా చూస్తాడు. కూతురితో ఆడతాడు, పాడతాడు. నాన్న అనే పిలుపుకోసం పరితపించిపోతాడు. కానీ ఈ తండ్రి ముచ్చుపచ్చలారని పసికందును విక్రయించాడు. ఆడపిల్లను అంగట్లో అమ్మకానికి పెట్టాడో తండ్రి. పసి గొడ్డును సరిగ్గా కళ్లు తెరవని ఓ నవజాత శిశవును అమ్మేశాడు. తల్లిని, బిడ్డను విడదీశాడు. కానీ తల్లిప్రేమ అలా ఉండనివ్వలేదు. పోరాటం చేసింది. పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని బండ్లగూడ ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును తండ్రి విక్రయించాడు.
పాప అదృశ్యమైన నాలుగు రోజుల తర్వాత చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్ (43), ఆస్మా బేగమ్ భార్యా భర్తలు. ఆస్మా 18 రోజుల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. జులై 8న ఆసిఫ్ పసిపాపను బయటకు తీసుకెళ్ళినప్పటికీ ఆమె లేకుండానే ఇంటికి తిరిగి రావడంతో అస్మా బేగమ్ ప్రశ్నించింది. భర్తను కూతురు ఏదీ అంటూ నిలదీసింది. అతడు ఏం చెప్పకపోవడంతో కన్నప్రేమ ఆమెను పోలీసు మెట్లెక్కేలా చేసింది. తన కుమార్తె కనిపించడం లేదని నాలుగు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్మా భర్త ఆసిఫ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఓ వ్యాపారికి అమ్మేశానని చెప్పాడు. రూ.లక్షకు శిశువును విక్రయించానని తెలిపారు.
పోలీసులు గట్టిగా విచారించగా.. సుల్తానా అనే మహిళ సాయంతో అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన 55 ఏళ్ల చాంద్ సుల్తానా అనే వ్యాపారికి విక్రయించాడు. 24 గంటల్లో పసికందును గుర్తించి చిన్నారిని ఆమెకు అప్పగించారు. ఆస్మా ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఈ కేసును చేధించారు. మహ్మద్ ఆసిఫ్, చాంద్ సుల్తానాతో, అమ్మకానికి మధ్యవర్తిత్వం వహించిన సుల్తానా అనే మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ కె సత్యనారాయణ తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు. పాపను రక్షించి, తల్లి వద్దకు చేర్చడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.