డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రాలేదని ప్రగతి భవన్‌ ముందు..

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదలు ఈ పథకం ద్వారా సొంతింటి కలను నిజం చేసుకున్నారు. అయితే, ఈ పథకానికి అప్లై చేసుకున్నా.. ఇళ్లు రాలేదని చాలా మంది బాధపడుతున్నారు. తాజాగా, డబుల్‌ బెడ్‌ రూము ఇళ్ల పథకం కింద ఇళ్లు రాలేదని ఓ జంట మనస్తాపం చెందింది. ఏకంగా ప్రగతి భవన్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌కు చెందిన 40 ఏళ్ల మహేందర్‌ అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం కుటుంబంతో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. కొన్ని నెలల క్రితం డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం కింద ఇంటి కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. ఈ పథకం ద్వారా అతడికి ఇళ్లు మంజూరైనట్లు కొద్దిరోజుల క్రితం అధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో ఆయన ఎంతో సంతోషించాడు. అయితే, ఏ అధికారి దగ్గరికి వెళ్లి తన ఇంటి గురించి అడిగినా.. సరైన సమాధానం రాలేదు.

ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్యతో పాటు ప్రగతిభవన్‌ దగ్గరకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ ఇద్దరూ తలపై పోసుకున్నారు. ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరినీ క్షేమంగా పక్కకు తీసుకువచ్చారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రాలేదని దంపతులు ప్రగతి భవన్‌ ముందు ఆత్మహత్యకు యత్నించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments