పంద్రాగస్టు రోజున.. శుభవార్త చెప్పిన CM KCR!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెటూరు మొదలు పట్నాల వరకు అంతూ మువ్వన్నెల జెండాను ఎగురవేసి పంద్రాగస్టు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్, గోల్కొండలో జెండా ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా పంద్రాగస్టు రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక శుభవార్త చెప్పారు. ఇప్పటికే రూ.లక్షలోపు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పారు. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త చెప్పారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు తీపి కబురు చెప్పారు. వారికి రూ.5 లక్షలకు బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా పారిశుద్ధ కార్మికులు చనిపోతే వారికి ఇచ్చే అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని భారీగా పెంచనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీల్లో ఉండే మల్టీ పర్పర్స్ వర్కర్స్ చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు బీమా అందేలా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. ఆ విధంగా వారి పేరిట ఎల్ఐసీ పాలసీ తీసుకోనున్నట్లు వెల్లడించారు.

సర్వీసులో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. కార్మికులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని పంచాయతీలు చెల్లిస్తాయని వెల్లడించారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికుల అంత్యక్రియల కోసం చెల్లిస్తున్న రూ.5 వేలను ఇప్పటి నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని కూడా సంబంధిత పంచాయతీలే చెల్లిస్తాయని ప్రకటించారు. నెలరోజులుగా నిరసనలు తెలిపి ఇటీవలే విధుల్లో చేరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభవార్త చెబుతారేమో అని ఎదురుచూశారు. వారు ఊహించిన విధంగానే వారికి సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు.

Show comments