పిల్లల్ని అమ్మే ముఠా గుట్టు రట్టు! పోలీసులకి చిక్కు ప్రశ్నలా.. కన్న ప్రేమ Vs పెంచిన ప్రేమ!

Child Trafficking: చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 16 మంది చిన్నారులను గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఎదుట ఓ చిక్కు ప్రశ్న నిలిచింది. ఆ వివరాలు..

Child Trafficking: చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 16 మంది చిన్నారులను గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఎదుట ఓ చిక్కు ప్రశ్న నిలిచింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో చిన్న పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న హైటెక్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఓ మహిళా డాక్టర్‌తో కలిసి.. పిల్లలను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో చిన్నారికి 1,80,000-5.50 లక్షల రూపాయల వరకు ధర కట్టి అమ్మేస్తున్నారు. ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి సుమారు 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు మాత్రమే కాక.. ఢిల్లీ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన చిన్నారులు సైతం ఉన్నారు. కొన్నిరోజుల క్రితం ఉప్పల్‌ మేడిపల్లి సమీపంలోని ఫిర్జాదిగూడలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఒకరు శిశువును విక్రయించారు. ఈ ఉదంతంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ హైటెక్‌ రాకెట్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

డబ్బుల కోసం కన్నవాళ్లకు తీరని శోకం మిగిల్చారు ఈ ముఠా. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడంతో.. మరో సమస్య తెర మీదకు వచ్చింది. నిందితులు  కొందరు చిన్నారులను కన్న వాళ్ల దగ్గర నుంచి అపహరించి.. పిల్లలను లేని దంపతులకు అమ్ముకున్నారు. ఇప్పుడు పోలీసులు చిన్నారులను స్వాధీనం చేసుకోవడంతో.. కన్నవాళ్లు సంతోషపడుతుంటే.. ఇన్నాళ్లు ఆ చిన్నారులను ప్రేమగా పెంచుకున్న వాళ్లు బిడ్డలు దూరం అవ్వడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. మా ప్రేమకు, కన్నీళ్లకు విలువలేదా అని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులను అక్రమంగా విక్రయించే ఈ ముఠా.. సంతానం లేక బాధపడుతున్న వారి వివరాలు సేకరించి.. పిల్లలను వారికి విక్రయిస్తున్నారు.

ఏళ్లుగా బిడ్డలు లేక..

ఈ ముఠా వద్ద నుంచి హైదరాబాద్‌, బంజరాహిల్స్‌, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పలువురు దంపతులు చిన్నారులను కొనుగోలు చేశారు. ఇలా అక్రమంగా చిన్నారులను కొనుగోలు చేసిన వారిలో ఏపీకి చెందిన వారు 16 మంది ఉండగా.. తెలంగాణ వారు 9 మంది ఉన్నారు. వీరిలో కొందరికి ఏకంగా 15 ఏళ్ల నుంచి పిల్లలు లేరు. దాంతో ముఠా వద్ద నుంచి రోజులు, నెలల వయసున్న చిన్నారులను అక్రమంగా కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి పిల్లలే లోకంగా బతుకుతున్నారు. బిడ్డలు లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో ఇన్నాళ్లు వారు ప్రత్యక్షంగా అనుభవించారు కనుక.. ఇప్పుడు తమ వద్దకు చేరిన బిడ్డలను అల్లారు ముద్దుగా.. ప్రాణపదంగా పెంచుకుంటున్నారు. వారిపైనే ఆశలన్ని పెట్టుకుని బతుకుతున్నారు. అలాంటిది ఇప్పుడు చిన్నారులను పోలీసులు తీసుకెళ్లడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పెంచిన వాళ్లకు తీరని శోకం..

పైగా ఈ ముఠా విక్రయించిన వారిలో ఆడపిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. దాంతో ఆ చిన్నారులను పెంచిన తల్లిదండ్రులు.. కన్నవారికి భారంగా మారిన బిడ్డల్నే కదా మేం తీసుకున్నది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం.. మా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాం. వారికి ఎలాంటి లోటు చేయడం లేదు. మరి ఎందుకు మా వద్ద నుంచి బిడ్డలను వేరు చేస్తున్నారు అంటూ కన్నీటితో ప్రశ్నిస్తున్నారు. చిన్నారుల్లో చాలా మందిని తల్లిదండ్రులే వదిలించుకున్నారు. కొందరు చెత్త కుప్పలో పడేసి వెళ్లారు. కొందరిని మాత్రం కిడ్నాప్‌ చేశారు. మరి ఇప్పుడు ఈ చిన్నారులను పోలీసులు తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారా.. లేక శివుశిహార్‌కు తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

అంతేకాక అసలు ఇప్పుడు ఈ చిన్నారులను తీసుకెళ్లడానికి ఎంతమంది తల్లిదండ్రులు ముందుకు వస్తారు.. ఒకవేళ రాకపోతే.. వీరికి కన్న ప్రేమ దూరం చేసిన వారు అవుతారు కదా.. మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి.. ఇన్నాళ్లు ఆ చిన్నారులను పెంచిన పెంపుడు తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు.. ఇలా అక్రమంగా పిల్లలను కొనడం నేరమే కానీ వారి మధ్య అనుబంధం ఏర్పడిన తర్వాత ఇలా విడదీయడం ఎంత వరకు సమంజసం అంటున్నారు. మరి ఈ ప్రశ్నలకు ఎవరు బదులు చెబుతారు.. కన్న ప్రేమ వర్సెస్‌ పెంచిన ప్రేమలో పోలీసులు ఎవరి వైపు నిల్చుంటారు అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.

Show comments