HYDలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. రూ. 7. 85 లక్షలు దోచేశారు

మరోసారి చెడ్డీ గ్యాంగ్ చెలరేగిపోయింది. హైదరాబాద్ నగరంలో మరోసారి దొంగతనాలకు పాల్పడ్డారు చెడ్డీ గ్యాంగ్. ఈ వార్తతో నగర వాసుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

మరోసారి చెడ్డీ గ్యాంగ్ చెలరేగిపోయింది. హైదరాబాద్ నగరంలో మరోసారి దొంగతనాలకు పాల్పడ్డారు చెడ్డీ గ్యాంగ్. ఈ వార్తతో నగర వాసుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

దొంగలు మితి మీరిపోతున్నారు. అర్థరాత్రి ఇంటికి కన్నాలు వేయడమే కాదూ.. పట్ట పగలే పెద్ద పెద్ద బ్యాంకుల దోపిడీకి పాల్పడుతున్నారు. ఆధునిక టెక్నాలజీతో పాటు పదునైన ఆయుధాలు వినియోగిస్తూ.. అందిన కాడికి దోచుకుంటూ దొరక్కుండా తిరుగుతున్నారు. కాదేదీ దొంగతనానికి అనర్హం అని నిరూపిస్తున్నారు. స్పూన్ దగ్గర నుండి సెల్ ఫోన్ టవర్స్, రైలు పట్టాలు, రైల్వే వంతెనలు కూడా లటుక్కున పట్టుకుపోయిన ఘటనలు అనేకం వెలుగు చూసిన సంగతి విదితమే. ఇప్పుడు వీరి కన్ను పాఠశాలల మీద పడింది. అసలే ఇప్పుడ అడ్మిషన్ల సమయం. విద్యా సంస్థల్లోనే డబ్బులు ఉంటాయనుకున్నారేమో.. ఓ పాఠశాలలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కి పడింది. చెడ్డీ గ్యాంగ్ మరోసారి హల్ చల్ సృష్టించింది. శనివారం అర్థరాత్రి మియాపూర్ పరిధిలో ఉన్న వరల్డ్ వన్ స్కూల్లోకి చొరబడ్డారు ఈ దొంగలు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో ఉన్న కౌంటర్ లో రూ. 7.85 లక్షల నగదును దోచుకోళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అందులో ఇద్దరు దొంగలు.. చెడ్డీలు ధరించి.. మొహానికి మాస్కులు వేసుకుని పాఠశాలలలోకి ప్రవేశించారు. ఫ్రంట్ డెస్క్ వద్ద తచ్చాడటం కనిపిస్తుంది. పదునైన ఆయుధాలు కనిపిస్తున్నాయి. చాలా చాక చక్యంగా లోపలికి చొరబడి.. పెద్ద మొత్తంలో డబ్బును దొంగలించారు ఈ చెడ్డీ దొంగలు.

కాగా, ఆదివారం ఉదయం స్కూల్ యాజమాన్యం తిరిగి పాఠశాలకు వెళ్లి చూడగా.. డబ్బులు కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. దొంగతనం జరిగినట్లు తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో ఇది చెడ్డీ గ్యాంగ్ పనే అని భావిస్తున్నారు. మరింత దర్యాప్తు కోసం విచారణ కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చెడ్డీ గ్యాంగ్ గతంలో కూడా నగరంలో దొంగతనాలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. చెడ్డీలు మాత్రమే ధరించి, పదునైన ఆయుధాలతో చోరీలకు పాల్పడుతూ ఉంటారు.

Show comments