P Krishna
P Krishna
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. వయసుతో ప్రమేయం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూస్తున్నారు. పనిఒత్తిడి, విపరీతంగా వ్యాయామం చేయడం, ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. తాజాగా గుండెపోటుతో బీఆర్ఎస్ నేత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
గతకొంత కాలంగా దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు ప్రజలను కలవరానికి గురచేస్తున్నాయి. తెలంగాణ బీఆర్ఎస్ లో విషాదం నెలకొంది. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత అబుజర్ బుధవారం కన్నుమూశారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అబుజర్ (42) గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు అబుజర్ ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఆదిలాబాద్ రీమ్స్ కి తరలించాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు రీమ్స్ కి తరలించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. అబుజర్ కన్నుమూసిన విషయం తెలియడంతో స్థానిక బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన మృతదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.