వరల్డ్‌ కప్‌పై కోహ్లీ ఎమోషనల్‌ కామెంట్స్‌!

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానుల ఫోకస్‌ మొత్తం రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌ 2023తో పాటు ఆ వెంటనే అక్టోబర్‌ 5 నుంచి మన దేశంలోనే జరిగే ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ 2023పై ఉంది. ఈ రెండు ప్రతిష్టాత్మక టోర్నీల కోసం టీమిండియా కూడా అన్ని విధాల సిద్ధం అవుతుంది. అప్పుడెప్పుడో 2018లో ఆసియా కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టు.. మళ్లీ ఆ ట్రోఫీలను ముద్దాడలేదు. ముఖ్యంగా వరల్డ్‌ కప్‌ విషయంలో మాత్రం.. కప్పు కొట్టాలనే ఒత్తిడి టీమిండియాపై కాస్త ఎక్కువగానే ఉంది. 2011లో గెలిచిన వరల్డ్‌ కప్‌ కూడా మన దేశంలోనే జరగడం, ఇప్పుడు ఈ వరల్డ్‌ కప్‌ ఇక్కడే జరుగుతుండటంతో క్రికెట్‌ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సారి టీమిండియా కచ్చితంగా వరల్డ్‌ కప్‌ గెలవాలనే ఒత్తిడి ఉంది. అయితే.. ఇప్పుడే కాదు, ఎప్పుడు వరల్డ్‌ కప్‌ జరిగినా టీమిండియాపై ఒత్తిడి, భారీ అంచనాలు ఉంటాయి. ఈ సారి కూడా అలానే ఉంది పరిస్థితి. ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ స్పందిస్తూ.. ‘ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. మేం కప్పు కొట్టాలని అభిమానులు ఎప్పుడూ కోరుకుంటారు. కానీ, వాళ్ల కంటే కూడా కప్పు గెలవాలనే కసి నాలోనే ఎక్కువ ఉంటుంది.’ అంటూ వరల్డ్ కప్ కొట్టాలనే తన కోరిక ఎంత బలమైందో వెల్లడించాడు.

2023 వరల్డ్ కప్‌ను ఒక ఛాలెంజ్‌గా స్వీకరిస్తున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. ఇలాంటి కొత్త అనుభవాల వల్ల తన ఆట మరోస్థాయికి చేరుతుందన్నాడు. ‘మన ముందు ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా సరే.. దాన్ని ఎదుర్కోవాలనే అనుకుంటాం. మీ ముందుకు కష్టం వస్తే ఉత్సాహంగా స్వీకరించండి. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. పదిహేనేళ్ల కెరీర్‌ తర్వాత కూడా నాకు ఇలా ఛాలెంజ్‌లు ఎదుర్కోవడం ఇష్టమే. ఈ వరల్డ్ కప్ కూడా నాకు ఒక ఛాలెంజ్.’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా, కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముందుగా ఆసియా కప్‌లో తన సత్తా చాటి, భారత్‌కు వరల్డ్‌ కప్‌ అందించాలని కోహ్లీ చాలా బలంగా ఫిక్స్‌ అయినట్లు అతని మాటల్ని బట్టి తెలిసిపోతుంది. మరి కోహ్లీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ప్రాక్టీస్‌లో కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం! ఫ్యాన్స్‌ నుంచి వింత రియాక్షన్‌

Show comments