World Cup 2023: వరుస విజయాలు సాధిస్తున్నా.. టీమిండియాలో భారీ లోపాలు!

వరుసగా ఆరు విజయాలు.. స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, స్టార్‌ బౌలర్లు బుమ్రా, షమీ, కుల్దీప్‌.. టీమిండియా అద్భుతంగా విజయపథంలో నడిపిస్తున్నారు. అయినా కూడా జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిపై దృష్టిపెట్టకుంటే సెమీస్‌, ఫైనల్‌లో అవే ఇబ్బందిగా మారొచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

వరుసగా ఆరు విజయాలు.. స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, స్టార్‌ బౌలర్లు బుమ్రా, షమీ, కుల్దీప్‌.. టీమిండియా అద్భుతంగా విజయపథంలో నడిపిస్తున్నారు. అయినా కూడా జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిపై దృష్టిపెట్టకుంటే సెమీస్‌, ఫైనల్‌లో అవే ఇబ్బందిగా మారొచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి.. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఉంది. ఈ ఆరు విజయాలతో టీమిండియా దాదాపు సెమీస్‌కు చేరినట్లే. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో తలపడిన టీమిండియా.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి కాస్త తడబడింది. కానీ, క్రికెట్‌ టీమ్‌ గేమ్‌ కావడంతో.. కొంతమంది ఆటగాళ్లు విఫలమైనా.. మరికొంతమంది జట్టును ఆదుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ దారుణంగా విఫలమైనా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 87 రన్స్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికి కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి సపోర్ట్‌ అందించారు. చివర్లో బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ సైతం విలువైన పరుగులు చేయడం విశేషం.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 229 పరుగులు మాత్రమే చేసింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా గెలిచిన 5 మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్‌ చేస్తూ గెలిచింది. తొలి సారి తొలుత బ్యాటింగ్‌ చేసి మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి. ఈ టైమ్‌లో బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో టీమిండియాకు తొలి ఓటమి ఎదురవుతుందా? అని క్రికెట్‌ అభిమానులు ఎంతో కంగారు పడ్డారు. కానీ, బౌలర్లు.. షమీ, బుమ్రా, కుల్దీప్‌, జడేజా అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. ఇంగ్లండ్‌ను కేవలం 129కే కుప్పకూల్చి.. టీమిండియాకు ఘన విజయం అందించారు. దీంతో టీమిండియా వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. అయితే.. ఇక్కడి వరకు అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా.. టీమిండియా కొన్ని లోపాలు కూడా దాగి ఉన్నాయి. విజయాలు వాటిని కవర్‌ చేస్తూ.. సెమీ ఫైనల్‌, ఫైనల్‌ల్లో అవే జట్టు విజయావకాశాలు దెబ్బతీయవచ్చు. అందుకే టీమ్‌ మేనేజ్‌మెంట్‌, కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహత్‌ శర్మ వాటిపై ఒక లుక్‌ వేయాల్సిన అవసరం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం టీమిండియా చాలా స్ట్రాంగ్‌గా ఉందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అందుకు కారణం ఏంటంటే.. విజయాలు. కానీ, వరల్డ్‌ ఛాంపియన్‌ అవ్వాలంటే.. చిన్న చిన్న లోపాలను కూడా సరిచేసుంటూ ముందుకు వెళ్లాలి. ఎందుకంటే ప్రతిసారి ప్రత్యర్థిపై కొంతమంది ఆటగాళ్లు మాత్రమే రాణించలేరు. అయితే.. ప్రస్తుతం టీమిండియా ఓపెనింగ్‌ జోడీలో రోహత్‌ శర్మ ఒక్కడే బాగా ఆడుతున్నాడు. రోహిత్‌ వేగంగా ఆడటంతో పవర్‌ ప్లేలో రన్‌రేట్‌ బాగానే ఉంటుంది. అలా అని శుబ్‌మన్‌ గిల్‌ నిదానంగా ఆడి, రోహిత్‌ అవుటైనా తర్వాత కూడా ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడంటే అదీ లేదు. రోహిత్‌ వేగంగా ఆడుతున్న సమయంలో స్ట్రైక్‌ ఎక్కువగా అతనికే ఇచ్చిన పర్వాలేదు కానీ, ఒక వికెట్‌ పడ్డ తర్వాత గిల్‌ కాస్త సమన్వయంతో ఆడాల్సిన అవసరం ఉంది. కోహ్లీ, రోహిత్‌ గురించి పెద్దగా ఇబ్బంది లేదు. ఒకరు విఫలమైనా మరొకరు బాగా ఆడుతున్నారు. జట్టు అవసరాలకు తగ్గట్లు ఎలా ఆడాలో వారికి తెలుసు.

ఇక కంగారు పడాల్సింది శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో.. టీమిండియాకు ప్రధాన బలంగా ఉన్న కోహ్లీ, రోహిత్‌ శర్మ అవుటైనా, ఇద్దరిలో ఒకరు క్రీజ్‌లో ఉన్న సమయంలో అయ్యర్‌ వారితో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలి. కానీ, అతను దారుణంగా విఫలం అవుతున్నాడు. ఒక్క మ్యాచ్‌లోనే ఫిఫ్టీ చేశాడు. చాలా సందర్భాల్లో టీమిండియా 4వ స్థానంలో బ్యాటర్‌ లేడేమో అన్నట్లు ఆడుతోంది. ఎందుకంటే ప్రతిసారి కేఎల్‌ రాహులే టీమిండియాను మిడిలార్డర్‌లో ఆదుకుంటున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌ అందుకోకుంటే.. సూర్య అతన్ని స్థానాన్ని ఆక్రమించే ఛాన్స్‌ ఉంది.

ఇక టీమిండియా నంబర్‌ వన్‌ బౌలర్‌, వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ టూ బౌలర్‌ అయినా సిరాజ్‌లో కాస్త కసి తగ్గినట్లు కనిపిస్తోంది. ఆసియా కప్‌లో కనిపించిన ఎనర్జీ మిస్‌ అవుతుంది. బుమ్రా, షమీ అంచనాలు మించి రాణిస్తుండటంతో సిరాజ్‌ బ్యాడ్‌ ఫామ్‌ జట్టుపై పెద్ద ప్రభావం చూపడం లేదు. సిరాజ్‌ కూడా తన లయ అందుకోవాల్సి ఉంది. ఇక జడేజా.. బౌలింగ్‌ అద్భుతంగా చేస్తున్నాడు. కానీ బ్యాటింగ్‌లో అతనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో కూడా జడేజా తన సత్తా చాటాల్సి ఉంది. ఐదుగురు బౌలర్లతో ఆడుతున్న సమయంలో ఎక్స్‌ట్రా బ్యాటర్‌ లేని టైమ్‌లో జడేజా కచ్చితంగా మంచి బ్యాటింగ్‌ చేయాల్సింది. ప్రస్తుతం టీమ్‌లో ఈ లోపాలు కనిపిస్తున్నాయని క్రికెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఇవి కూడా సర్దుకుంటే.. వరల్డ్‌ ఛాంపియన్స్‌ కాకుండా టీమిండియాను ఎవరూ అడ్డుకోలేరు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments