రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్ కొట్టాలంటే వాళ్లిద్దరూ బాగా ఆడాలి: రవిశాస్త్రి

వన్డే వరల్డ్ కప్ కొద్దిలో మిస్సవడంతో టీ20 వరల్డ్ కప్​ను అయినా కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే పొట్టి కప్పు సొంతం కావాలంటే రోహిత్, కోహ్లీనే ఆడితే సరిపోదన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.

వన్డే వరల్డ్ కప్ కొద్దిలో మిస్సవడంతో టీ20 వరల్డ్ కప్​ను అయినా కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే పొట్టి కప్పు సొంతం కావాలంటే రోహిత్, కోహ్లీనే ఆడితే సరిపోదన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.

వన్డే వరల్డ్ కప్-2023 కొద్దిలో మిస్సవడంతో కోట్లాది మంది భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి. మెగా టోర్నీ ఫైనల్ వరకు ఓటమి అనేది లేకుండా దూసుకొచ్చిన రోహిత్ సేన.. ఆఖరి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి కప్పును చేజార్చుకుంది. వన్డే ప్రపంచ కప్ మిస్సవడంతో టీ20 వరల్డ్ కప్​ను అయినా కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది. జూన్ నుంచి మొదలయ్యే పొట్టి కప్పును ఎలాగైనా చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అయితే కప్పు సొంతం కావాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే ఆడితే సరిపోదని అంటున్నాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. వీళ్ల కంటే ఆ ఇద్దరు ప్లేయర్లే మెగా టోర్నీలో కీలకం కానున్నారని అన్నాడు.

‘రాబోయే వరల్డ్ కప్​లో టీమిండియాలో ఆ ఇద్దరు ప్లేయర్లు కీలకం కానున్నారు. వాళ్లిద్దరికీ ఇదే తొలి ప్రపంచ కప్ కావడం విశేషం. ఇద్దరూ లెఫ్టాండర్లే. వాళ్లు మరెవరో కాదు.. ఒకరు డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అయితే మరొకరు విధ్వంసక ఫినిషర్ శివమ్ దూబె. నా ఫోకస్ వాళ్లిద్దరి మీదే ఉంది. ఇంగ్లండ్​తో సిరీస్​లో జైస్వాల్ ఆడిన తీరును ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అతడికి భయం అంటే ఏంటో తెలియదు. జైస్వాల్ చాలా బాగా షాట్లు కొడతాడు. మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు దిగే దూబె కూడా చాలా డేంజరస్ బ్యాటర్. అతడో మ్యాచ్ విన్నర్. అతడు సరదాగా సిక్సులు కొట్టే రకం. స్పిన్నర్లు ఎదురైతే అతడు వాళ్లకు నరకం చూపిస్తాడు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

దూబె మామూలు హిట్టర్ కాదని.. అతడు కొడితే ఒక స్టేడియంలో నుంచి బాల్ ఇంకో స్టేడియం వరకు వెళ్లాల్సిందేనని అన్నాడు రవిశాస్త్రి. భారీ షాట్లు బాదడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని.. ముఖ్యంగా స్పిన్నర్లను అతడు ఊచకోత కోస్తాడని పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలోనూ దూబె చాలా మెరుగయ్యాడని మెచ్చుకున్నాడు రవిశాస్త్రి. పేసర్ల బౌలింగ్​లో ఎలాంటి బంతులను బాదాలి, ఎప్పుడు హిట్టింగ్ చేయాలనేది అతడికి మంచి అవగాహన ఉందన్నాడు. చివరి నాలుగైదు ఓవర్లలో మ్యాచ్ ఛేంజ్ చేయాలంటే అది దూబెకు సాధ్యమని.. అతడ్ని టీమిండియా సరిగ్గా వినియోగించుకోవాలని సూచించాడు రవిశాస్త్రి. మరి.. రోహిత్, కోహ్లీ కంటే జైస్వాల్, దూబె వరల్డ్ కప్​లో కీలకమంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments